డీజిల్ ఇన్నింగ్స్ లు పోయాయి.. ఇప్పుడు ఈవీ ఇన్నింగ్స్ లు: ఆకాశ్ చోప్రా

  • చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు గైక్వాడ్ గురించి ఆకాశ్  ఆసక్తికర కామెంట్స్
  • బెన్ స్టోక్స్ దూకుడుగా ఆడకపోవచ్చన్న అభిప్రాయం
  • రుతురాజ్ ఆ పాత్ర పోషించాలన్న సూచన
మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే లీగ్ దశ నుంచే నిష్క్రమించడం తెలిసిందే. ఈ సారి జట్టు సమతూకం మారింది. బెన్ స్టోక్స్ తోపాటు కొంత మంది కొత్త వారు చేరారు. ఈ క్రమంలో ఆకాశ్ చోప్రా విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. దీనిపై ఆయన తన యూట్యూబ్ చానల్ లో ఓ వీడియో విడుదల చేశారు.

బెన్ స్టోక్స్ బౌలర్లపై విరుచుకుపడడం కంటే, తన ఇన్నింగ్స్ నిర్మించడంపైనే దృష్టి పెట్టొచ్చని చోప్రా అభిప్రాయపడ్డారు. సూపర్ కింగ్స్ లో ఇప్పటికే ఈ తరహా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నట్టు గుర్తు చేశారు. ‘‘ప్రపంచకప్ లో అతడ్ని (స్టోక్స్) చూశాం. మిడిలార్డర్ లో అతడు సమయం తీసుకుంటాడు. మూడో స్థానంలో అయితే మెరుగ్గా ఆడగలడు. ఐపీఎల్ లో అలా వచ్చినప్పుడే అతడు సెంచరీ సాధించాడు. ఇప్పుడు సీఎస్కేలో రాబిన్ ఊతప్ప కూడా లేడు’’ అని చోప్రా పేర్కొన్నారు.

రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుతూ.. అతడు మరింత దూకుడుగా ఆడాల్సి ఉంటుందన్నారు. ‘‘రుతురాజ్ గైక్వాడ్ బంతులను బాదేసి పరుగెత్తగలడు. ఇప్పటి వరకైతే అతడు ఇన్నింగ్స్ ను నిదానంగా మొదలు పెట్టి, తర్వాత వేగం పుంజుకుంటున్నాడు. కానీ, డీజిల్ ఇంజన్ రోజులు పోయాయి. ఇప్పుడు ఈవీ రోజులు. రుతురాజ్ ఎలక్ట్రిక్ వాహనంలా మారాలి’’ అని చోప్రా తెలిపారు.


More Telugu News