‘చాట్ జీపీటీ’ని న్యాయ సలహా అడిగిన పంజాబ్-హర్యానా హైకోర్టు!

  • తానైతే బెయిలు ఇవ్వబోనని స్పష్టం చేసిన చాట్ జీపీటీ
  • నిందితుడి నేరప్రవృత్తి, సత్ప్రవర్తనను బట్టి బెయిలు మంజూరు చేయొచ్చని సలహా 
  • న్యాయశాస్త్రంపై చాట్ జీపీటీ అవగాహనను పరీక్షించేందుకే టెస్ట్ చేశామన్న న్యాయమూర్తి
  • చాట్ జీపీటీ చెప్పిన దానిని బట్టి తీర్పులు ఇవ్వొద్దన్న న్యాయమూర్తి
కృత్రిమ మేధ ద్వారా సంచలనాలు సృష్టిస్తున్న ‘చాట్ జీపీటీ’ వెబ్‌సైట్‌ను ఓ హైకోర్టు ఏకంగా న్యాయ సలహా కోరింది. ఇతరులపై క్రూరంగా దాడిచేసిన వ్యక్తులు బెయిలు కోసం దరఖాస్తు చేసుకుంటే మీరేమని సలహా ఇస్తారంటూ పంజాబ్-హర్యానా హైకోర్టు చాట్ జీపీటీని అడిగింది. దీనికి చాట్ జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనుషుల్ని చంపుతున్నారు కాబట్టి బెయిలు పిటిషన్‌ను తిరస్కరిస్తానని చెప్పింది. అంతేకాదు, దాడి క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిలు మంజూరు చేయాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొన్న చాట్ జీపీటీ.. నిర్దోషినని నిరూపించుకునేందుకు బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప బెయిలుకు అర్హుడు కాదని తేల్చి చెప్పింది. కాకపోతే, నిందితుడి నేరప్రవృత్తి, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తులు బెయిలు మంజూరు చేయొచ్చని పేర్కొంది.

నిందితులకు బెయిలు మంజూరు విషయంలో చాట్ జీపీటీని హైకోర్టు న్యాయ సలహా కోరడంపై న్యాయమూర్తులు స్పందించారు. న్యాయశాస్త్రంపై చాట్ జీపీటీకి ఎలాంటి అవగాహన ఉందో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేశాం తప్పితే అది వెల్లడించే అభిప్రాయాలను పాటించడానికి కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, చాట్ జీపీటీ ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తీర్పులను వెలువరించ కూడదని జస్టిస్ అనూప్ చిట్కారా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇక, అసలు విషయానికి వస్తే.. పంజాబ్‌కు చెందిన నిందితుడిపై 2020లో హత్య, ఇతర నేరాలకు సంబంధించి కేసు నమోదైంది. బెయిలు కోసం నిందితుడు పెట్టుకున్న దరఖాస్తుపై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే, నిందితుడి గతాన్ని బట్టి బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అతడిని బెయిలుపై విడుదల చేస్తే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.


More Telugu News