మా పరిహారం కాజేశాడు.. వైసీపీ నేతపై రైతుల ఆరోపణ

  • కోన ఫారెస్టులో భూములు కోల్పోయిన  రైతులు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల పరిహారం
  • బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసుకున్న రైతులు
  • వైసీపీ నేత తమ పరిహారంలో కొంత కాజేశారని రైతుల ఆరోపణ
  • తమతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న చెక్కులతోనే మోసానికి పాల్పడ్డాడని ఆవేదన
  • కాకినాడ జిల్లా కెలెక్టర్‌కు ఫిర్యాదు
కోన ఫారెస్టులోని తమ భూమిని తీసుకున్నందుకు కేఎస్ఈజెడ్, ఏపీఐఐసీ అధికారులు ఇచ్చిన పరిహారంలో కొంత మొత్తాన్ని వైసీపీ నేత ఒకరు నొక్కేశారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా అందులో రూ.3 లక్షలను వైసీపీ నేత తొండంగి మండలం కోదాడ సర్పంచి భర్త బూర్తి నాని అక్రమంగా తీసేసుకున్నారని ఆరోపించారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కోదాడ పంచాయితీకి చెందిన నొక్కు సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం ద్వారా దళిత రైతులకు పరిహారం మంజూరైందన్నారు. 

ఇందు కోసం రైతులు బ్యాంకు ఖాతాలు కూడా తెరిచారని, అయితే వారి బ్యాంకు ఖాతా, చెక్కు బుక్కును వైసీపీ నేత తీసుకున్నారని ఆరోపించారు. రైతులపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకున్నారన్నారు. ఆ తరువాత వాటి సాయంతో ఒక్కో అకౌంట్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్డీవో కార్యాలయం, బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. దీంతో.. ఆర్డీఓ కార్యాలయ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పూర్తి పరిహారం దక్కేవరకూ అధికారులు ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. పోయిన సొమ్ము తిరిగి ఇప్పిస్తానంటూ రైతులకు హామీ ఇచ్చారు.


More Telugu News