స్కాట్లాండ్ తొలి ముస్లిం నేతగా పాకిస్థాన్ మూలాలున్న వ్యక్తి!

  • అధికార స్కాటిష్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా హమ్జా యూసఫ్
  • స్కాట్లాండ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని హామీ
  • మనవడు స్కాంట్లాండ్ మంత్రి అవుతాడని తమ తాతలు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చన్న హమ్జా
  • దేశాన్ని నడిపించేందుకు రంగు, మత విశ్వాసంతో పనిలేదన్న యూసఫ్
పాకిస్థాన్ మూలాలున్న హమ్జా యూసఫ్ యూకేలోని ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. యూకేలో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా ఆయన రికార్డులకెక్కారు. 37 ఏళ్ల హమ్జా తన పోటీదారులను ఓడించి అధికార స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్‌పీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్కాట్లాండ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు.

స్కాంట్లాండ్ ప్రజలకు గతంలో కంటే ఇప్పుడు స్వాతంత్ర్యం అవసరం ఉందన్న హమ్జా.. దానిని అందించే తరం వారమవుతామని అన్నారు. 1960లో పాకిస్థాన్ నుంచి స్కాట్లాండ్ వచ్చిన తమ తాతలు.. మనవడు స్కాట్లాండ్ తొలి మంత్రి అవుతాడని వారు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చని అన్నారు. చర్మం రంగు, లేదంటే మత విశ్వాసం వంటివి మన ఇల్లుగా పిలుచుకునే దేశాన్ని నడిపించేందుకు అవరోధం కాదన్న స్ఫష్టమైన సందేశాన్ని పంపినందుకు మనం గర్వపడాలని హమ్జా అన్నారు. 

యూసఫ్ తన ప్రసంగంలో తాతలను గుర్తు చేసినప్పుడు ఆయన భార్య, తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. స్కాట్లాండ్ నేతగా ప్రజల జీవన వ్యయ సంక్షోభ పరిష్కారం, పార్టీలో విభేదాలను అంతం చేయడం, స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా యూసఫ్ పేర్కొన్నారు.


More Telugu News