నిఖత్ జరీన్‌కు ‘థార్’ బహుమతి.. అందించిన మహీంద్రా ఆటోమోటివ్!

  • 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్‌పై నిఖత్ అద్భుత విజయం
  • ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును గెలుచుకున్న నిఖత్
  • భారత క్రీడా చరిత్రలో నిఖత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందంటూ మహీంద్రా ట్వీట్
ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్‌గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిష్ చరిత్రలో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. 

స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. నిఖత్ తెలంగాణకు గర్వకారణమని, ఆమె తన విజయాలతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిందని కొనియాడారు. 

కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న నిఖత్‌‌ ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును కూడా గెలుచుకుంది. ఎదురనేదే లేకుండా భారత క్రీడా చరిత్రలో నిఖత్ సరికొత్త అధ్యయాన్ని లిఖించిందని ప్రశంసిస్తూ మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. ఆమె అద్భుతమైన ప్రతిభకు గాను కొత్త థార్ కారును అందిస్తున్నట్టు పేర్కొంది.


More Telugu News