భారత మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లలో ఎప్పుడూ లేనంత బేరిష్

  • 2 లక్షలకు పైగా నెట్ షార్ట్ పొజిషన్ కాంట్రాక్టులు 
  • గత ఐదేళ్లలో ఈ స్థాయిలో పెరగడం తక్కువ సందర్భాల్లోనే 
  • స్వల్ప కాలానికి బేరిష్.. మార్కెట్లు పడిపోతాయనే అంచనాలు
విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల పట్ల తీవ్ర బేరిష్ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీనికి నిదర్శనంగా గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత నికర షార్ట్ పొజిషన్లను వారు కొనసాగిస్తున్నారు. యూఎస్ ఫెడ్ అదే పనిగా వడ్డీ రేట్లు పెంచుతూ వెళుతుండడం, దీంతో అమెరికాలో బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారడం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, తాజాగా తోడైన అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం.. ఇవన్నీ కలసి ప్రతికూల ధోరణిని బలోపేతం చేస్తున్నాయి. 

ఈ పరిణామాల ఫలితంగా విదేశీ ఇన్వెస్టర్లు కొన్ని నెలలుగా భారత మార్కెట్లపై ప్రతికూల వైఖరితోనే కొనసాగుతున్నారు. భారత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సాగిస్తూనే ఉన్నారు. అదే సమయంలో మన దేశీయ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, బీమా సంస్థలు, ఇతర ఇనిస్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐలు కొనుగోళ్లు చేస్తుండడం మార్కెట్లు భారీగా పడిపోకుండా ఆదుకుంటోంది. 

నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్లలో ఎఫ్ పీఐల ఓపెన్ షార్ట్ కాంట్రాక్టులు 2,16,000కు పెరిగాయి. కానీ, గత ఐదేళ్లలో సగటున ఈ షార్ట్ కాంట్రాక్టులు లక్షగానే ఉండేవి. దాంతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లలో నెట్ షార్ట్ పొజిషన్లు 2,00,000 కాంట్రాక్టులను దాటిపోయింది కేవలం 6 శాతం ట్రేడింగ్ రోజుల్లోనే నమోదైంది. నికర షార్ట్ పొజిషన్లు పెరగడం అనేది సమీప కాలానికి మార్కెట్ల పట్ల ఎఫ్ పీఐలు బేరిష్ వైఖరితో ఉన్నారని తెలియజేస్తోందని, ఇక్కడి నుంచి మార్కెట్లు పడిపోతాయనే అంచనాతో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇండెక్స్ ఫ్యూచర్, ఆపన్షన్లలో షార్ట్ చేసి.. పడిపోయిన తర్వాత కొనుగోలు చేయడం వల్ల లాభాలు సమకూరతాయి.


More Telugu News