ఇప్పటివరకు 96 లీటర్ల రక్తం దానం.. 80 ఏళ్ల మహిళ గిన్నిస్ రికార్డు

  • కెనడా మహిళ జోసెఫీన్‌కు గిన్నిస్ రికార్డు
  • ఆరు దశాబ్దాల్లో 203 యూనిట్ల రక్తదానం
  • భవిష్యత్తులోనూ రక్తదానం కొనసాగిస్తానన్న జోసెఫీన్
గత ఆరు దశాబ్దాలుగా రక్తం దానం చేస్తున్న ఓ కెనడా మహిళ అరుదైన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ మొత్తం 96 లీటర్ల రక్తాన్ని దానం చేసిన జోసెఫీన్ మిచాలుక్(80) తాజాగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. జోసెఫీన్‌పై గిన్నిస్‌ రికార్డ్స్‌ వారు పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె ఇప్పటివరకూ లెక్కకు మిక్కిలి బాధితుల ప్రాణాలు కాపాడారని చెప్పుకొచ్చారు. 

1955లో జోసెఫీన్ తనకు 22 ఏళ్ల వయసున్నప్పుడు తొలిసారిగా రక్త దానం చేశారు. తన సోదరి ప్రోత్సాహంతో ఈ నిస్వార్ధ చర్యకు పూనుకున్నారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఆమె రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ సుమారు 203 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఇది సుమారు 96 లీటర్లకు సమానం. ఎనభయ్యో పడిలో ఉన్నప్పటికీ ఆమె రక్తదానాన్ని కొనసాగిస్తున్నారు. రక్తదానానికి వయోపరిమితి లేకపోవడంతో పాటూ జోసెఫీన్ ఆరోగ్యం కూడా సహకరించడంతో ఆమె సమాజసేవను కొనసాగిస్తున్నారు. 

‘‘నా పేరిట ఓ రికార్డు ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు రికార్డుల కోసం నేను రక్తదానం చేయట్లేదు. అయితే.. ఇక ముందు కూడా ఇదే మార్గంలో పయనిస్తా’’ అని ఆమె చెప్పుకొచ్చారు. జోసెఫీన్ బ్లడ్ గ్రూప్ ‘ఓ’ పాజిటివ్. అమెరికా ఆసుపత్రుల్లో ఈ బ్లడ్ గ్రూప్‌కు బాగా డిమాండ్ ఉంది. అమెరికా రెడ్ క్రాస్ నివేదిక ప్రకారం.. అమెరికా జనాభాలో 37 శాతం మంది బ్లడ్ గ్రూప్ ఇదే.


More Telugu News