15 ఏళ్ల వయసులోనే హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నా: శిఖర్ ధవన్

  • ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తొలి టాటూ వేయించుకున్నానన్న ధవన్
  • ఆ తరువాత హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకున్నట్టు వెల్లడి
  • టాటూ గురించి తండ్రికి తెలిసి దంచేశాడన్న ఓపెనర్
శిఖర్ ధవన్..గొప్ప ఓపెనర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ధనవ్ తన ఆటతీరుతో పాటూ ఆహార్యం, స్టయిల్‌తోనూ అభిమానులపై చెరగని ముద్రవేశాడు. శిఖర్ ధవన్ టాటూలు కూడా అతడి వ్యక్తిత్వంలో ఓ భాగమని అభిమానుల అభిప్రాయం. ధవన్ తాజాగా తన తొలి టాటూ గురించి మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

‘‘అప్పుడు నాకు 14-15 ఏళ్లు ఉంటాయి. అప్పట్లో మనాలీలో ఉండగా నేను ఇంట్లో వాళ్లకు చెప్పకుండా టాటూ వేయించుకున్నాను. మూడు నాలుగు నెలల పాటూ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెట్టాను. చివరకు ఓ రోజున విషయం మా నాన్నకు తెలియడంతో నన్ను దంచేశారు. అయితే.. ఎందరికో ఉపయోగించిన సూదినే నాకు టాటూ వేసేందుకు వాడటంతో ఒకింత భయంగా ఉండేది. దీంతో.. నేను వెళ్లి హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నాను. అయితే.. టెస్ట్ రిజల్ట్ నెగెటివ్‌గా వచ్చిందనుకోండి’’ అని అతడు చెప్పుకొచ్చాడు. 

తన తొలి టాటూ ఓ వృశ్చికానిదని కూడా ధవన్ చెప్పాడు. అంతేకాకుండా.. తన ఒంటిపై శివుడు, అర్జునుల టాటూలు కూడా ఉన్నాయని చెప్పాడు. అర్జునుడు గొప్ప విలుకాడు కావడంతో ఆ టాటూ వేయించుకున్నానని చెప్పాడు. 

ప్రస్తుతం యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్న బీసీసీఐ శిఖర్ ధవన్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టింది. అయితే.. త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో ధవన్ పాల్గొననున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు పంజాబ్ కింగ్స్‌కు నేతృత్వం వహిస్తున్నాడు.


More Telugu News