టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

  • 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సఫారీలు
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 258 రన్స్ చేసిన వెస్టిండీస్
  • జాన్సన్ చార్లెస్ సూపర్ సెంచరీ
  • లక్ష్యఛేదనలో మెరుపు దాడి చేసిన డికాక్, హెండ్రిక్స్
  • గతంలో ఆసీస్ పేరిట హయ్యస్ట్ ఛేజింగ్ రికార్డు
  • ఇప్పుడా రికార్డును తిరగరాసిన దక్షిణాఫ్రికా
సెంచురియన్ లో ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో పరుగులు వెల్లువెత్తాయి. సిక్సర్లు, ఫోర్లు కొట్టడం ఇంత సులభమా అన్నట్టు ఇరుజట్లలోని ఆటగాళ్లు బ్యాట్లతో చెలరేగిపోయారు. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ పిచ్ బ్యాటింగ్ కు సహకరించడంతో దక్షిణాఫ్రికా వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ నమోదు చేసింది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన జాన్సన్ చార్లెస్ విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. చార్లెస్ కేవలం 46 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 51 పరుగులు సాధించాడు. 

ఆఖర్లో రొమారియో షెపర్డ్ 18 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 3, వేన్ పార్నెల్ 2 వికెట్లు తీశారు. 

అనంతరం, భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసి అద్భుత విజయం అందుకుంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్ శివమెత్తినట్టు ఆడారు. వెస్టిండీస్ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించారు.

డికాక్ 44 బంతుల్లోనే 100 పరుగులు సాధించడం విశేషం. అతడి స్కోరులో 9 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. హెండ్రిక్స్ 28 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (38 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (16 నాటౌట్) జట్టును గెలుపుతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 1, ఓడియన్ స్మిత్ 1, రేమాన్ రీఫర్ 1, కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ 1 వికెట్ తీశారు. 

ఈ సక్సెస్ ఫుల్ రన్ చేజింగ్ తో ఆసీస్ రికార్డు తెరమరుగైంది. 2018లో ఆసీస్ ఛేజింగ్ లో న్యూజిలాండ్ పై 5 వికెట్లకు 245 పరుగులు చేసి విజయం సాధించింది.


More Telugu News