ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

  • ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ
  • టీడీ జనార్దన్ నేతృత్వంలో కమిటీ ముమ్మర కృషి
  • చంద్రబాబు నివాసంలో సమావేశం
  • త్వరలో వెబ్ సైట్, పుస్తకాల ఆవిష్కరణ
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో నేడు పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో సమావేశం నిర్వహించారు. 

ప్రజానాయకుడు, తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో తరతరాలకు ఆయన గుర్తుండిపోయేలా 'జయహో ఎన్టీఆర్' అన్న వెబ్ సైట్, 'శకపురుషుడు' అనే ప్రత్యేక సంచికతో పాటు ఎన్టీఆర్ శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని చంద్రబాబుకు జనార్ధన్ వివరించారు. రెండు పుస్తకాలను విజయవాడలో ఆవిష్కరిస్తామని, వెబ్ సైట్ మరియు శకపురుషుడు సంచికను హైదరాబాదులో ఏర్పాటు చేసే కార్యక్రమంలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ రెండింటికీ సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబుకు వివరించారు. 

గత ఐదు నెలలుగా ఎన్టీఆర్ శతజయంతి కమిటీ శ్రమిస్తోందని, సినిమా రంగంలోని ప్రముఖులు మరియు రాజకీయరంగంలోని నిష్ణాతుల అభిప్రాయాలను వీడియో/వ్యాస రూపంలో తీసుకోవటం జరిగిందని ఎన్టీఆర్ ఖ్యాతి తరతరాలు నిలిచిపోయేలా వీటిని రూపకల్పన చేస్తున్నామని జనార్ధన్ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్టీ రామారావు గారు నటుడుగా, రాజకీయ నాయకుడుగా అనూహ్య విజయాలను సాధించి మార్గదర్శకుడిగా మిగిలాడని కీర్తించారు. అలాంటి నాయకుడిపై జనార్ధన్ సారథ్యంలోని కమిటీ చేస్తున్న కృషి అభినందనీయం అని తెలిపారు. ఈ కమిటీ చేస్తున్న అవిరళ కృషికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. హైదరాబాద్, విజయవాడ రెండు ప్రాంతాలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు విజయవంతం కావటానికి అన్ని రకాలైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శతజయంతి కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, కె. రవిశంకర్, విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు, మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్, మధుసూదన రాజు, విజయ్ భాస్కర్, గౌతమ్ బొప్పన కూడా పాల్గొన్నారు. వారు చేస్తున్న కృషిని తెలుసుకుని చంద్రబాబు అందరినీ పేరుపేరునా అభినందించారు.


More Telugu News