సచిన్ రికార్డును కోహ్లీ అందుకోలేడన్న రవిశాస్త్రి

  • అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన సచిన్
  • 75 సెంచరీలు సాధించిన కోహ్లీ
  • సచిన్ రికార్డు అందుకునే అవకాశాలున్నాయంటూ కథనాలు
  • కోహ్లీ ఆ రికార్డు సాధిస్తే గొప్ప విషయమేనన్న రవిశాస్త్రి
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా ఫామ్ లేమితో కొట్టుమిట్టాడి, ఇటీవలే మళ్లీ పూర్వపు వైభవాన్ని సంతరించుకున్నాడు. ఇటీవల ఆసీస్ పై సెంచరీ సాధించి టెస్టుల్లో చాన్నాళ్ల తర్వాత శతకాల బాటపట్టాడు. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 75వ సెంచరీ. 

కాగా, అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే కోహ్లీ... సచిన్ రికార్డు అందుకుంటాడంటూ కథనాలు వచ్చాయి. దీనిపై టీమిండియా మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి స్పందించారు. 

కోహ్లీనే కాదు... మరెవరైనా 100 సెంచరీల వరకు వస్తే అది గొప్ప విషయమేనని వ్యాఖ్యానించారు. కోహ్లీలో మరో ఐదారేళ్లు ఆడే సత్తా ఉందని, ఫిట్ నెస్ పరంగానూ తిరుగులేదని, కానీ 100 సెంచరీల రికార్డును అతడు అందుకుంటాడని మాత్రం గట్టిగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు. 

"ఇప్పటివరకు 100 సెంచరీలు కొట్టింది ఎంతమంది?... ఒకే ఒక్కడు. ఆ లెక్కన చూస్తే కోహ్లీ ఆ రికార్డును అందుకుంటాడా అనేది ఊహకు అందని విషయం" అని వివరించారు.


More Telugu News