పంజాబ్ లోని ఓ గ్రామంపై విరుచుకుపడిన టోర్నడో.. మన దేశంలో అరుదు

  • ఫజిల్కా జిల్లాలో కనిపించిన టోర్నడో
  • 50 ఇళ్లు ధ్వంసం.. 12 మందికి గాయాలు
  • క్యుములోనింబస్ మేఘాలు, బలమైన గాలులతో ఏర్పడే టోర్నడోలు
  • అసాధారణ వాతావరణ పరిస్థితులే కారణం  
అమెరికాలో టోర్నడోల బీభత్సం గురించి వినే ఉంటారు. టోర్నడోల వల్ల జరిగిన నష్టాన్ని టీవీల్లోనూ చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి పరిణామమే మన దేశంలోనూ చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ గ్రామంపై టోర్నడో విరుచుకుపడింది. సుమారు 12 మంది గాయపడినట్టు, 50 ఇళ్లు దెబ్బతిన్నట్టు, పంటలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. గురు, శుక్రవారాల్లో పంజాబ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

పంజాబ్ లో వారం వ్యవధిలో వచ్చిన రెండో టోర్నడో ఇదని వెదర్ మ్యాన్ నవ్ దీప్ దహియా అనే ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, ఉరుములతో కూడిన వాన, బలమైన గాలులు రావడంతో ఇవన్నీ కలసి టోర్నడో ఏర్పడడానికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉరుములతో కూడిన వానకు, భిన్నమైన దిశలో గాలి తోడైనప్పుడు టోర్నడోలు వస్తుంటాయి. 

నిజానికి పంజాబ్ లో వచ్చింది తేలిక పాటి టోర్నడోనే. అమెరికాలో దీనికి ఎన్నో రెట్లు బలమైనవి వస్తుంటాయి. క్యుములోనింబస్ మేఘాలు, భూమికి మధ్య అనుసంధానంగా బలమైన గాలి తోడయ్యి ఓ వలయం మాదిరిగా చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. మన దేశంలో ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పంజాబ్ లోనే 2007 నుంచి చూస్తే ఇది నాలుగో టోర్నడో కావడం గమనించొచ్చు.


More Telugu News