ఈ కార్లలో ఆడియో సిస్టమ్ అదుర్స్

  • ప్రస్తుత తరం కార్లలో ఆధునిక టెక్నాలజీలు
  • బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్ లకు పెద్ద పీట
  • వరల్డ్ క్లాస్ ఆడియో సిస్టమ్స్ ను అందిస్తున్న కార్ల కంపెనీలు
ఇప్పుడొస్తున్న కార్లు, ఎస్ యూవీ లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తున్నారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, అడాస్ (సెల్ఫ్ డ్రైవింగ్), ఎక్కడికక్కడ సెన్సర్లు, కెమెరాలు, ఎయిర్ బ్యాగులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫీచర్లు ఉంటున్నాయి. వీటికి తగ్గట్టుగానే తమ వాహనాల్లో సౌండ్ సిస్టమ్ కూడా బాగుండాలని వాహనదారులు కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని కార్లలో వరల్డ్ క్లాస్ ఎంటర్టయిన్ మెంట్ వ్యవస్థలను పొందుపరిచారు. ఆ కార్ల వివరాల్లోకి వెళితే...

1. టాటా టియోగో, టాటా టిగోర్
దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ టియాగో, టిగోర్ కార్లను రూపొందించింది. ఇందులో అంతర్జాతీయ బ్రాండ్ హార్మన్ సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇది 4 స్పీకర్ ఆడియో సిస్టమ్. టియాగో కారు ధర రూ.8.05 లక్షలు (ఎక్స్ షోరూం) కాగా, టిగోర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.20 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. చిన్న కార్లే అయినప్పటికీ ఆడియో సిస్టమ్ లో మాత్రం రాజీపడలేదు.

2. హ్యుండాయ్ ఐ20
బోస్ ఆడియో సిస్టమ్స్ ను శబ్ద నాణ్యతకు మారుపేరుగా చెబుతుంటారు. దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ తన ఐ20 హ్యాచ్ బ్యాక్ కారులో బోస్ సౌండ్ సిస్టమ్ ను పొందుపరిచింది. అది కూడా 7 స్పీకర్ కాన్ఫిగరేషన్ తో వస్తోంది. దీన్ని 10.25 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ కు అనుసంధానం చేశారు. హ్యుండాయ్ ఐ20లో టాప్ ఎండ్ వేరియంట్లు రూ.11.25 లక్షల ఎక్స్ షోరూం ధర పలుకుతున్నాయి.

3. టాటా పంచ్
టాటా మోటార్స్ రూపొందించిన చిన్న కారు పంచ్. ఇందులో 4 స్పీకర్లు, 2 ట్వీటర్లతో కూడిన హార్మన్ సౌండ్ సిస్టమ్ ను చూడొచ్చు. హార్మన్ ట్రేడ్ మార్క్ టెక్నాలజీతో శ్రావ్యమైన సంగీతం వినొచ్చు. టాటా పంచ్ కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. టాటా పంచ్ రూ.9.54 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. 

4. కియా సోనెట్
కొన్నాళ్ల కిందట భారత్ లో కాలుమోపిన కొరియా కార్ల తయారీ సంస్థ కియా. ఏపీలోని తమ ప్లాంట్ నుంచి అనేక రకాల మోడళ్లను కియా ఉత్పత్తి చేస్తోంది. వీటిలో సోనెట్ ఒకటి. ఇందులో బోస్, అర్కామీస్ ఆడియో సిస్టమ్ లను ఏర్పాటు చేశారు. సోనెట్ టాప్ ఎండ్ వేరియంట్లలో బోస్ 7 స్పీకర్ కాన్ఫిగరేషన్ ఇవ్వగా.... సాధారణ వేరియంట్లలో 4 స్పీకర్లు, 2 ట్వీటర్లతో కూడిన అర్కామీస్ ఆడియో సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఎక్స్ షోరూమ్ ధరల ప్రకారం కియో సోనెట్ రూ.14.89 లక్షల ధర పలుకుతోంది.

5. హ్యుండాయ్ వెన్యూ
హ్యుండాయ్ సంస్థను వచ్చిన మరో చిన్న కారు వెన్యూ. ఎస్ యూవీ లుక్ తో కనిపించే వెన్యూలో 4 స్పీకర్ల అర్కామీస్ సౌండ్ సిస్టమ్ ను పొందుపరిచారు. దీనిని 8 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ కు అనుసంధానం చేశారు. హ్యుండాయ్ వెన్యూలో టాప్ ఎండ్ వేరియంట్ రూ.13.11 లక్షల ధర (ఎక్స్ షోరూం) పలుకుతోంది.

6. హోండా సిటీ
జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా తన సిటీ మోడల్ ను కొత్తగా ముస్తాబు చేసి భారత్ లో మరోసారి తీసుకువస్తోంది. దీంట్లో సౌకర్యాలను కూడా ఆధునికీకరించారు. ముఖ్యంగా, 8 స్పీకర్లతో సరౌండ్ సౌండ్ సిస్టమ్ ను పొందుపరిచారు. 8 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్ వ్యవస్థ ద్వారా ఈ ప్రీమియం క్వాలిటీ సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది. హోండా సిటీలో జడ్ఎక్స్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.15.97 లక్షలు.

7. హ్యుండాయ్ వెర్నా
హ్యుండాయ్ సంస్థ సెడాన్ సెగ్మెంట్లో వెర్నాకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తీసుకువస్తోంది. దీంట్లోనూ బోస్ సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇది 8 స్పీకర్ కాన్ఫిగరేషన్ తో వస్తోంది. వేరియంట్ ను బట్టి 8 అంగుళాలు లేక 10.25 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థకు అనుసంధానంగా ఈ సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది. హ్యుండాయ్ వెర్నాలో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.17.38 లక్షలు (ఎక్స్ షోరూ).

8. స్కొడా స్లావియా, కుషాక్
యూరప్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కొడా స్లావియా, కుషాక్ మోడళ్లలో 6 స్పీకర్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది. మెరుగైన బాస్ కోసం సబ్ వూఫర్ ను కూడా అందిస్తోంది. స్లావియా, కుషాక్ మోడళ్ల ధరలు రూ.18.4 లక్షల నుంచి రూ.19.69 లక్షల మధ్యలో ఉన్నాయి.

9. ఫోక్స్ వాగన్ విర్చూస్, టైగున్
జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వాగన్ భారత్ లో విర్చూస్, టైగున్ మోడళ్ల అమ్మకాలు సాగిస్తోంది. ఈ రెండు మోడళ్లలో వేరియంట్లను బట్టి 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, 8 స్పీకర్ 
సౌండ్ సిస్టమ్ లను అందుబాటులో ఉంచారు. ఈ కార్ల ఎక్స్ షోరూం ధరలు రూ.18.42 లక్షల నుంచి రూ.18.96 లక్షల వరకు ఉన్నాయి.

10. ఎంజీ హెక్టర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్
మోరిస్ గ్యారేజెస్ (ఎంజీ) ఇండియా తన హెక్టర్ మోడల్ కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకువచ్చింది. ప్రీమియం లుక్ ను కోరుకునేవారు హెక్టర్ ఫేస్ లిఫ్ట్ వైపు అడుగులేస్తుంటారు. ఇందులో ఇన్ఫినిటీ బ్రాండ్ కు చెందిన 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ను పొందుపరిచారు. ఈ సౌండ్ సిస్టమ్ లో సబ్ వూఫర్ కూడా ఉంటుంది. మరే కారులో లేనంత భారీగా ఎంజీ హెక్టర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో 14 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థను అందించారు. ఈ కారులో టర్బో షార్ప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.19.81 లక్షలు.


More Telugu News