బీజేపీ వాళ్లకు ఏ జడ్జీ శిక్ష వేయరు: ప్రియాంక గాంధీ

  • సోదరుడిపై అనర్హత వేటు అంశంపై మండిపడ్డ ప్రియాంక
  • గాంధీ కుటుంబాన్ని కించపరచడం బీజేపీకి అలవాటు
  • ప్రధాని సహా ఆ పార్టీ నేతల కామెంట్లపై ఏ జడ్జీ స్పందించరని ఫైర్
గాంధీ కుటుంబాన్ని విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని, ఇది నిత్యం కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు ప్రతీ ఒక్కరూ తమ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తుంటారని చెప్పారు. నెహ్రూ, ఇందిర, సోనియా, రాహుల్.. ఇలా గాంధీ కుటుంబంలోని అందరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఈ విషయం దేశం మొత్తానికీ తెలుసని చెప్పారు. అయినా కూడా ఏ జడ్జి కూడా వారికి రెండేళ్ల శిక్ష విధించరని, వారిపై అనర్హత వేటు పడదని మండిపడ్డారు.

రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. వాస్తవంగా రాహుల్ గాంధీపై పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టులో స్టే ఉందని చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అదానీ ఇష్యూను లేవనెత్తారని, దేశంలో ఏం జరుగుతోందని గట్టిగా తన స్వరం వినిపించారని గుర్తుచేశారు. ఆ తర్వాతే ఈ పరువునష్టం దావా తెరపైకి వచ్చింది.. అత్యవసరంగా విచారణ కూడా పూర్తయి, తీర్పు వెలువడిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. అయితే, అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురిచేసినా తన సోదరుడు రాహుల్ అన్యాయానికి తలవంచడని ప్రియాంక స్పష్టం చేశారు. 


More Telugu News