రాహుల్ వ్యాఖ్యల అంశం పరువు నష్టం కలిగించేంత పెద్దది కాదు: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

  • మోదీ అనే ఇంటిపేరుపై 2019లో రాహుల్ వ్యాఖ్యలు
  • దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకుంటోందన్న రాహుల్
  • నీరవ్ మోదీ, లలిత్ మోదీని ఉద్దేశించి విమర్శలు
  • రాహుల్ పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ 
  • రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
  • లోక్ సభ సభ్యుడిగా రాహుల్ పై అనర్హత వేటు
దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఎందుకుంటోంది అని  2019లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అప్పట్లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్ణాటకలో ఈ వ్యాఖ్యలు చేశారు. అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పరారైన లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చెబుతోంది. 

అయితే ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు వేయగా, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, నిబంధనల ప్రకారం లోక్ సభ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. 

రాహుల్ వ్యాఖ్యల అంశం పరువునష్టం కలిగించేంత పెద్దది కాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ఉంటుందని ఖర్గే వెల్లడించారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై ఎంతవరకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. 

నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరినీ సభ నుంచి గెంటేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే ముద్ర చాలా దారుణం అని ఖర్గే వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ... వీళ్లంతా బలహీన వర్గాల వారా? అని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.


More Telugu News