గాడ్సేకి నోబెల్ ప్రైజ్ అడుగుతారేమో.. జమ్మూకశ్మీర్ ఎల్జీపై కేటీఆర్ సెటైర్లు!

  • గాంధీకి లా డిగ్రీ లేదంటూ మనోజ్ సిన్హా వ్యాఖ్యలు
  • సదరు వీడియోను ట్వీట్ చేసిన బీఆర్ఎస్ నేత సతీశ్ రెడ్డి 
  • గాడ్సేకి నోబెల్ కోసం ప్రచారాన్ని ప్రారంభించినా ఆశ్చర్యపోనంటూ కేటీఆర్ కామెంట్   
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించేందుకు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు తెలంగాణ మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా నిత్యం ఏదో ఒక అంశంపై నిలదీస్తూ.. ఎద్దేవా చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాపై సెటైర్లు వేశారు.

మనోజ్ సిన్హా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘గాంధీజీకి లా డిగ్రీ ఉందనే అపోహ ఉంది. ఆయనకు ఒక్క డిగ్రీ కూడా లేదని మీకు తెలుసా? ఆయన ఏకైక అర్హత హైస్కూల్ డిప్లొమా. లా ప్రాక్టీస్ చేయడానికి గాంధీ అర్హత సాధించారు. కానీ న్యాయ పట్టా పొందలేదు. ఆయనకు డిగ్రీ లేదు’’ అని చెప్పారు.

మనోజ్ సిన్హా మాట్లాడుతున్న వీడియోను బీఆర్ఎస్ నేత, టీఎస్ఆర్ఈడీసీవో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ట్వీట్ చేశారు. “మహాత్మా గాంధీకి డిగ్రీ లేదని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. గాంధీజీ ఒక బారిస్టర్ అని, లండన్ యూనివర్సిటీ కాలేజ్ లో చదివారని దయచేసి ఎవరైనా ఆయనకు చెప్పగలరా’’ అని పేర్కొన్నారు.

దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘తర్వాత వాళ్లు గాడ్సేకి నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రచారాన్ని ప్రారంభించినా నేను ఆశ్చర్యపోను. వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు మరి’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం మనోజ్ సిన్హా వ్యాఖ్యలపై నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


More Telugu News