టీబీ రహిత భారత్ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములుగా చేశాం: ప్రధాని మోదీ

  • నేడు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం
  • వారణాసిలో వన్ వరల్డ్ టీబీ సదస్సు
  • హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • టీబీ వార్షిక నివేదిక విడుదల
  • టీబీ నిర్మూలన సంబంధిత కార్యక్రమాలు ప్రారంభం
ఇవాళ (మార్చి 24) ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా వారణాసిలో నిర్వహించిన వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. టీబీ నిర్మూలనకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించారు. 2023 సంవత్సరానికి గాను టీబీ వార్షిక నివేదికను కూడా విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, వసుధైక కుటుంబం అనే సిద్ధాంతం భారత ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. పాతకాలం నాటి ఈ ఆలోచన సమస్యల పరిష్కారంలో ఆధునిక ప్రపంచానికి దారి చూపుతుందని మోదీ పేర్కొన్నారు. 

భారత్ లో క్షయ వ్యాధి రహిత భారత్ కోసం కృషి చేస్తున్నామని అన్నారు. టీబీ రహిత భారత్ ఉద్యమంలో దేశ ప్రజలను భాగస్వాములను చేశామని తెలిపారు. 10 లక్షల మంది టీబీ రోగులను సామాన్య ప్రజలు దత్తత తీసుకున్నారని వివరించారు. 

టీబీ రహిత భారత్ ఉద్యమంలో భాగంగా దేశ ప్రజల నుంచి 'నిక్షయ మిత్ర'లను ఆహ్వానించామని మోదీ వెల్లడించారు. చిన్న పిల్లలు కూడా టీబీ వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు. 10 నుంచి 12 ఏళ్ల వయసున్న బాలలు కూడా నిక్షయ మిత్రలుగా ఏర్పడి టీబీ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. వారు తమ కిడ్డీ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న డబ్బులతో టీబీ నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తున్నారని ప్రధాని మోదీ వివరించారు. 

టీబీ రోగుల కోసం నిక్షయ మిత్రల సాయం రూ.1000 కోట్లు దాటిపోయిందని వెల్లడించారు. టీబీకి వ్యతిరేకంగా ప్రపంచంలోనే ఇంత భారీస్థాయిలో సామాజిక ప్రోత్సాహం లభించడం స్ఫూర్తి కలిగిస్తోందని చెప్పారు. విదేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు.


More Telugu News