ఈ మహిళా టీసీ ఎవరినీ విడిచి పెట్టదు.. ముక్కు పిండి మరీ రూ.కోటి ఫైన్ వసూలు

  • సదరన్ రైల్వేలో ప్రయాణికులను హడలెత్తిస్తున్న మహిళా టీసీ
  • నిబంధనలు పాటించని వారికి రూ.1.03 కోట్ల జరిమానా
  • భారీ ఆదాయం రాబట్టిన తొలి మహిళా చెకింగ్ ఉద్యోగికి ప్రశంసలు
ఆమె పేరు రోసలిన్ అరోకియా మేరీ. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. తన విధుల్లో ఆమె ఎంతో కచ్చితంగా, ఖండితంగా ఉంటారు. టికెట్ లేకుండా పట్టుబడితే జరిమానా చెల్లిస్తే తప్ప విముక్తి కల్పించరు. ఇలా టికెట్ లేని ప్రయాణికులు, నిబంధనలు పాటించని వారి నుంచి ఆమె రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, నిజాయతీగా పనిచేస్తున్న ఈ మహిళా టికెట్ ఇన్ స్పెక్టర్ కు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు, సామాన్యులు సైతం మేరీని అభినందిస్తున్నారు. 

దీనిపై రేల్వే శాఖ ట్వీట్ చేసింది. ‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని అందులో పేర్కొంది. ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్న మేరీకి ట్విట్టర్ లో యూజర్లు పెద్ద సంఖ్యలో అభినందనలు చెబుతున్నారు.


More Telugu News