ఏడాది తర్వాత కలుసుకుని నవ్వులు చిందించిన ధోనీ, జడేజా

  • చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కలుసుకున్న సహచరులు
  • గతేడాది ఐపీఎల్ లో ఘోర వైఫల్యం తర్వాత కలుసుకోవడం మొదటిసారి
  • ఐపీఎల్ సమీపించడంతో మైదానంలో ప్రాక్టీస్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులైన ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా ఎట్టకేలకు కలుసుకున్నారు. 2022 ఐపీఎల్ సీజన్ జడేజాకి చేదు అనుభవం మిగిల్చిన విషయం తెలిసిందే. చెన్నై జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించగా, పూర్తిగా విఫలం కావడంతోపాటు, ఒత్తిడి తట్టుకోలేక మధ్యలోనే బాధ్యతలను విడిచి పెట్టేశాడు. ఆ తర్వాత తిరిగి ధోనీయే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో చెన్నై జట్టు లీగ్ దశ నుంచే వెనుదిరిగింది. 

ఇక అప్పటి నుంచి చాలా పరిణామాలు జరిగాయి. జడేజా తన సామాజిక మాధ్యమాలపై చెన్నై జట్టుకు సంబంధించిన గుర్తులను తొలగించారు. దీంతో ఎక్కడో ఏదో తేడా వచ్చిందని అభిమానులు సందేహించారు. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. 2023 సీజన్ కు ముందు జడేజాని సీఎస్కే రీటెయిన్ చేసుకుంది. ఈ నెల 31 నుంచి ఐపీఎల్ సంరంభం మొదలు కానుంది. దీంతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఇక్కడకు చేరుకున్న జడేజా, ధోనీ సరదాగా నవ్వుకుంటూ స్టేడియంలో నడుస్తుండడాన్ని వీడియోలో గమనించొచ్చు. 

ఈ వీడియోని సీఎస్కే తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. మజా (మహేంద్ర సింగ్, జడేజా సంక్షిప్తం) బా, మజా బా! అని ట్వీట్ చేసింది. తన క్రికెట్ కెరీర్ రెండు మహేంద్రాస్ చుట్టూనే కేంద్రీకృతమై ఉందంటూ.. ఒకటి కోచ్ అయితే రెండేది కెప్టెన్ ధోనీ అంటూ రవీంద్ర జడేజా ఇటీవలే వెల్లడించడం గమనార్హం. చెన్నై జట్టుకు జడేజా సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నాడు. దీంతో బలమైన బంధం ఉండడం సహజమే. ఈ నెల 31న చెన్నై జట్టు, గుజరాత్ టైటాన్స్ జట్టుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనుంది.


More Telugu News