ఉద్ధవ్ థాకరే వర్గానికి మరో షాక్.. సంజయ్ రౌత్ ను పార్లమెంటరీ నేతగా తొలగించిన షిండే

  • ఉద్ధవ్ థాకరేకు వరుస షాక్ లు ఇస్తున్న షిండే
  • గజానన్ ను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించిన వైనం
  • లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ లకు లేఖ
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే వర్గానికి మరో షాక్ తగిలింది. శివసేన పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉద్ధవ్ ముఖ్య అనుచరుడు సంజయ్ రౌత్ ను ప్రస్తుత శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తొలగించారు. ఆయన స్థానంలో లోక్ సభ ఎంపీ గజానన్ కీర్తికర్ ను నియమించారు. ఈ మేరకు షిండే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ కు లేఖ రాశారు. అంతేకాదు, పార్లమెంటులోని శివసేన కార్యాలయంలో గజానన్ ను సీట్లో కూర్చోబెట్టారు.

గత ఏడాది శివసేనను షిండే చీల్చిన సంగతి తెలిసిందే. శివసేన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉద్ధవ్ పని చేస్తున్నారని... పార్టీకి వ్యతిరేకులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఆ తర్వాత బీజేపీ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత శివసేన పార్టీని చట్టబద్ధంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. షిండే నేతృత్వంలోని శివసేనే అసలైన శివసేన అని కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో స్పష్టం చేసింది. ఉద్ధవ్ థాకరే వర్గానికి మరో పార్టీ పేరును, గుర్తును కేటాయించింది. రాజ్యసభలో శివసేనకు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్, ప్రియాంక చతుర్వేదిలు సభ్యులుగా ఉన్నారు. 



More Telugu News