పరీక్ష రాస్తుండగా ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన 108 సిబ్బంది!

  • మహబూబ్ నగర్ లో పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి తీవ్ర అస్వస్థత
  • వెంటనే 108కు సమాచారమిచ్చిన పీఆర్డీవో
  • క్షణాల్లోనే వచ్చి అమ్మాయిని కాపాడిన 108 సిబ్బంది
టీనేజ్ పిల్లలకు కూడా గుండెపోటు వస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థినికి గుండెపోటు వచ్చింది. అయితే సమయానికి సీపీఆర్ చేయడంతో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.

ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పరీక్ష రాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్‌ విద్యార్ధిని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు వెంటనే 108కు ఫోన్ చేశారు. క్షణాల్లోనే షరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ చేసి విద్యార్థిని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారికి గుండెపోటు వస్తోంది. టీనేజ్ పిల్లలకు కూడా హార్ట్ అటాక్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటిదాకా ఉల్లాసంగా ఉన్న వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రులకు తీసుకెళ్లే లోపే చనిపోతున్నారు. ఎవరైనా గమనించి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఆర్ పై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.


More Telugu News