ఎకరాకు రూ.10 వేల పరిహారం: సీఎం కేసీఆర్

  • మధిర నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం
  • ఇటీవలి అకాల వర్షాలకు 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని వెల్లడి
  • ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని కేసీఆర్ ను కోరిన రైతులు
అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను గురువారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పరిహారం చెల్లించి రైతులను ఆదుకుంటామని చెప్పారు.

పంటనష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపేదిలేదని స్పష్టం చేశారు. ఇంతకుముందు పంపిన వాటికే మోదీ సర్కారు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నష్టపోయిన ప్రతీ ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని అన్నారు. ఈ రైతులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.


More Telugu News