ఎవరినైనా బాధపెట్టి ఉంటే మన్నించండి: కంగనా రనౌత్
- అందరికీ మంచి జరగాలన్నదే తన అభిలాష అని ప్రకటన
- తనను విజయపథంలో నడిచేలా చేసింది శత్రువులేనని వెల్లడి
- వారికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని అన్న కంగనా
- 36వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో సందేశం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. గురువారం ఇన్ స్టా గ్రామ్ వేదికపైకి వచ్చిన రనౌత్.. తనను అభిమానించే వారు, అనుసరించే వారు, ద్వేషించే వారిని ఉద్దేశించి సందేశాలు పోస్ట్ చేసింది.
గులాబీ రంగు అంచుతో ఉన్న ఆకుపచ్చని చీర ధరించి ఆమె తన వీడియోని షేర్ చేసింది. మెడ మొత్తం బంగారం నెక్లెస్ తో అలంకరించుకుంది. తనకు మద్దతుగా నిలిచిన తన తల్లిదండ్రులు, తనకు బోధించిన గురువులకు ధన్యవాదాలు తెలియజేసింది. ఆ తర్వాత తనను ద్వేషించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలని కంగనా రనౌత్ కోరింది.
‘‘నా శత్రువులు నన్ను విశ్రాంతి కూడా తీసుకోనివ్వకుండా చేశారు. నేను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదు. కానీ, నన్ను నా పాదాలపై నిలుచుని, విజయ పథంలో నడిచేలా చేశారు. ఎలా పోరాడాలో నేర్పించారు. వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’ అని కంగనౌ రనౌత్ పోస్ట్ చేయడం గమనార్హం.
‘‘స్నేహితులారా నా సిద్ధాంతం చాలా సులభం. నా ప్రవర్తన, ఆలోచనలు చాలా సాధారణం. అందరికీ మంచి జరగాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశ సంక్షేమం కోసం మాట్లాడుతూ నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే అలాంటి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను’’ అని ఆమె రాసుకొచ్చింది. (ఇన్ స్టా వీడియో కోసం)