ఏనుగులను రైళ్లు ఢీకొనకుండా పరిష్కారం కొనుగొన్న రైల్వే

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏనుగుల సంరక్షణ
  • రైల్వే ట్రాక్ లకు పరికరాల ఏర్పాటు
  • ట్రాక్ పైకి ఏనుగులు వచ్చినప్పుడు సంకేతాల ద్వారా అప్రమత్తం
మన దేశం గజరాజులకు నిలయం. ఆసియా ఏనుగుల కేంద్రం. ఆసియా ఏనుగుల సంతతిలో 60 శాతం మన దేశంలోనే ఉంది. దేశవ్యాప్తంగా ఏనుగుల అభయారణ్యాలు 32 ఉన్నాయి. అయినా, వాటి సంతతి తగ్గుతోంది. ఇందుకు మానవులే కారణం. ఏనుగులు వేటగాళ్ల చేతుల్లో బలైపోతుంటే, దీని తర్వాత ఎక్కువ ఏనుగులు రైళ్లు ఢీకొనడం వల్లే మృత్యువాత పడుతున్నాయి. ఎలక్ట్రిక్ షాక్ వల్ల 741 ఏనుగులు చనిపోతే, రైల్వే ట్రాక్ లను దాటే క్రమంలో రైళ్లు ఢీకొని 186 ఏనుగులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఇప్పుడు అసోం, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఏనుగులు రైళ్లకు బలికాకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారం తీసుకుంటున్నారు. తద్వారా ఏనుగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) పరికరాలను ఈశాన్య సరిహద్దు రైల్వే ఉపయోగిస్తోంది. రైల్వే ట్రాక్ పై రద్దీని ఈ పరికరం గుర్తించి అప్రమత్తం చేస్తుంది. 86 ఏనుగుల కారిడార్లకు గాను 11 కారిడార్లలో ఈశాన్య సరిహద్దు రైల్వే వీటిని అమర్చి చూడగా.. 70 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ మార్గంలో ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. 

‘‘రైల్వే ట్రాక్ పై ఏనుగుల సంచారం ఉన్నప్పుడు ఈ పరికరం వైబ్రేషన్ ను సృష్టిస్తుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ప్రయాణంచే సంకేతాల్లో వేరియేషన్స్ తీసుకొస్తుంది. అప్పుడు ఏఐ ఆధారిత సాఫ్ట్ వేర్ ఈ సంకేతాల ఆధారంగా ఏనుగుల ట్రాఫిక్ ను గుర్తిస్తుంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తం అవుతారు. మంచి ఫలితాలు రావడంతో మిగిలిన అన్ని ఏనుగుల కారిడార్లలోనూ దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యధిక ఏనుగులు ఉన్న తమిళనాడులోనూ అటవీ అధికారులు ఏఐ సాయంతో ప్రమాదాలను నివారించేందుకు నిర్ణయించారు. మదుక్కరై నుంచి వలయార్ మధ్య రైల్వే ట్రాక్ పై ఏఐ ఆధారిత పరికరాలను అమర్చనున్నారు. ఇక్కడ 2008 నుంచి 11 ఏనుగులు మరణించాయి.


More Telugu News