దేశంలో గృహ హింస కేసులు.. అసోం ఫస్ట్.. తెలంగాణ నెక్ట్స్!

  • ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022’ సర్వేను విడుదల చేసిన కేంద్రం
  • 50.4 శాతం గృహ హింస కేసులతో తెలంగాణ సెకండ్
  • భర్త, అతడి కుటుంబ సభ్యుల దాడులే ఎక్కువ
  • కోర్టుల్లో లక్షలాది పెండింగ్ కేసులు
  • పెరిగిన వేధింపులు, కిడ్నాపులు, అత్యాచారాలు
దేశంలో గృహ హింస కేసులకు సంబంధించి కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ నిన్న నివేదిక విడుదల చేసింది. ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. 75 శాతం గృహ హింస కేసులతో అసోం ప్రథమ స్థానంలో ఉండగా, 50.4 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 48.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మహిళలపై మూడో వంతు దాడులు ఆమె భర్త, బంధువులు చేస్తున్నవే. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వాటిలో ఉద్దేశపూర్వక దాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతం ఉండగా 2019-21 నాటికి ఇవి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 31.9 శాతానికి దిగొచ్చాయి. మళ్లీ ఇప్పుడు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

బాబోయ్ ఇన్ని కేసులు పెండింగా?
మహిళలపై దాడులకు సంబంధించి 2021 నాటికి దేశవ్యాప్తంగా 21.22 లక్షల కేసులు కోర్టుల్లో ఉండగా, ఇప్పటి వరకు పరిష్కారమైనవి 83,536 కేసులు మాత్రమే. కాబట్టి ఈ కేసుల విషయంలో కోర్టులు మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని సర్వే అభిప్రాయపడింది. అలాగే, 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, 2011 నాటికి ఇది 47,746కు పెరిగింది. 2021లో కొంత తగ్గి 45,026గా నమోదయ్యాయి. 

ఇంట్లోనే ఎక్కువ
ఇక దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఇంట్లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు సర్వే తేల్చింది. భర్త, అతడి బంధువుల దాడికి సంబంధించి 2016లో 1,10,378 కేసులు నమోదు కాగా, 2021 నాటికి ఇవి 1,36,234కు పెరిగాయి. 2016తో పోలిస్తే 2021లో అత్యాచార ఘటనలు కొంత తగ్గి 31,677గా నమోదయ్యాయి. అయితే, కిడ్నాపులు, ఉద్దేశపూర్వక దాడులు, లైంగిక వేధింపులు బాగా పెరిగాయి.


More Telugu News