కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

  • బ్యాడ్మింటన్ ఆడుతూ రెండేళ్ల క్రితం డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ మృతి
  • కుమారుడి జ్ఞాపకాలను పదిలంగా ఉంచాలని తల్లిదండ్రుల నిర్ణయం
  • తన కుమారుడి ఆదర్శ జీవితం అందరికీ తెలియాలన్న ఇవిన్ తండ్రి
26 ఏళ్ల అతి చిన్న వయసులోనే మృతి చెందిన కుమారుడి జ్ఞాపకాలను పదిలంగా ఉంచేందుకు ఓ తండ్రి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సమాధిపై ఓ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి దానిని కుమారుడి పూర్తి వివరాలున్న వెబ్‌సైట్‌కు అనుసంధానం చేశారు. కేరళలోని త్రిసూరులో జరిగిందీ ఘటన.

డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్‌కు సంగీతంలోను, క్రీడల్లోనూ ప్రావీణ్యం ఉంది. 2021లో ఆయన బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. కురియాచిరలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడు ఆదర్శ జీవితం గడపడంతో అతడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలని భావించిన తండ్రి ఫ్రాన్సిస్.. ఇవిన్ సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి దానిని అతడి పూర్తి వివరాలున్న వెబ్‌సైట్‌తో అనుసంధానం చేశారు.

ఇవిన్ జీవించి ఉన్నప్పుడు వివరాలన్నింటినీ క్యూఆర్ కోడ్ రూపంలో భద్రపరిచి ఉంచేవాడని, ఇప్పుడు అతడి విషయంలోనూ అదే చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తన కుమారుడి సమాధిని సందర్శించిన వారికి అతడి పేరు మాత్రమే కాక ఎలా జీవించాలో కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.


More Telugu News