స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టుల్లో నచ్చిన చోటే ఫ్లాట్.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు ఆఫర్

  • ఏపీలోని 22 నగరాలలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లు
  • అన్ని అనుమతులు, సదుపాయాలతో అభివృద్ధి చేసిన సర్కారు
  • ప్రభుత్వ ఉద్యోగుల కోసం 10 ఫ్లాట్లు రిజర్వ్.. ఫ్లాట్ ధరపై 20 శాతం డిస్కౌంట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వెసులుబాటు కల్పించింది. ఉద్యోగులు తమకు నచ్చిన చోట, కోరుకున్న చోట ఫ్లాట్ తీసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిబంధనలు సడలించింది. ఈమేరకు జీవో నంబర్ 38 జారీ చేసింది. గతంలో ఈ స్మార్ట్ టౌన్ షిప్ లలో ఫ్లాటు తీసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగులపై పలు ఆంక్షలు ఉండేవి. ఇందులో ప్రధానంగా.. తాము పనిచేస్తున్న ప్రాంతంలోని స్మార్ట్ టౌన్ షిప్ లలో మాత్రమే ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఉండేది. దీనిని ప్రభుత్వం సవరిస్తూ కొత్త జీవో జారీ చేసింది.

ఏపీలోని 22 నగరాలు, పట్టణాల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లను అన్ని అనుమతులు, సదుపాయాలతో అభివృద్ధి చేసింది. మార్కెట్ ధరకంటే తక్కువకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించింది. ఈ టౌన్ షిప్ లలో ఉద్యోగుల కోసం 10 ఫ్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు 20 శాతం రాయితీ కూడా ఇస్తోంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చిన టౌన్ షిప్ లో ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు.


More Telugu News