హ్యాపీ హార్మోన్లు కావాలా..? వీటిని తింటే చాలు..

  • ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు తీసుకోవాలి
  • డార్క్ చాక్లెట్, అవకాడో, బ్లూ బెర్రీలతో మంచి ఫలితాలు
  • సాల్మన్ చేపలు, పాలకూర, తోటకూర, అరటి పండు తీసుకోవచ్చు
నేటి జీవనంలో స్ట్రెస్ (ఒత్తిడి) అంతర్లీనంగా ఉంటోంది. ఇది మరీ ఎక్కువ ఉన్నప్పుడు శారీరక, మానసిక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఒత్తిడి తొలగించుకుని, సంతోషంగా ఉండడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో ప్రాణాయామం ముఖ్యమైనది. యోగాసనాలు కూడా ఫలితమిస్తాయి. మంచి నడక వల్ల కూడా ఉపయోగాలున్నాయి. వీటికితోడు ఒత్తిడి తగ్గించి, సంతోషానిచ్చే హార్మోన్లను ప్రేరేపించే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. 

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లలో ఉండే కాంపౌండ్లు ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. ఇవి సహజసిద్ధమైన ఒపియేట్స్. వీటిని మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఇవి నొప్పిని తగ్గించి, ఆనందకర భావనలను తెస్తాయి. డార్క్ చాక్లెట్లలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించే మెగ్నీషియం కూడా ఉంటుంది. 

అవకాడో
అవకాడో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్న పండు. ఇందులో పొటాషియం, ఫైబర్, ఆరోగ్యాన్నిచ్చే కొవ్వులు ఉంటాయి. సెరటోనిన్ అనే న్యూరోట్రాన్స్ మీటర్ ఉత్పత్తికి కీలకమైన విటమిన్ బీ6 కూడా ఉంటుంది.

బ్లూ బెర్రీలు
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి ఒత్తిడిని నుంచి రక్షణనిస్తాయి. విటమిన్ సీ కూడా వీటిట్లో ఎక్కువే. ఇది సైతం ఒత్తిడిని తగ్గిస్తుంది.

సాల్మన్
సాల్మన్ చేపల్లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇన్ ఫ్లమ్మేషన్ ను ఇవి తగ్గిస్తాయి. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కార్టిసాల్ ఆందోళనకూ కారణమవుతుంది.

ఆకుపచ్చని కూరగాయలు
పాలకూర, తోటకూర మంచివి. వీటిల్లో విటమిన్స్, మినరల్స్ దండిగా ఉంటాయి. వీటిల్లో మెగ్నీషియం ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. 

చెర్రీ టమాటా
వీటిల్లో లైకోపీన్ అనే ఫైటో న్యూట్రియెంట్ ఉంటుంది. ఇన్ ఫ్లమ్మేషన్ కు దారితీసే రసాయనాలను ఇది నిరోధిస్తుంది. 

పులియబెట్టిన పదార్థాలు
పెరుగు ఇతర పులిసిన పదార్థాలను తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. శరీరంలో ఒత్తిడిని తగ్గించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

నట్స్ సీడ్స్
నట్స్ లోనూ మెగ్నీషియం దండిగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. 

అరటి పండ్లు
అరటి పండ్లలో సెరటోనిన్ లభిస్తుంది. కనుక మంచి భావనలకు అరటి పండు కూడా తోడ్పడుతుంది. సెరటోనిన్ ను మన శరీరం తయారు చేసుకోవాలంటే విటమిన్ బీ6 అవసరం. అది కూడా అరటి పండ్లలో ఉంటుంది.


More Telugu News