భారత్‌లో ఒక్క రోజులో వెయ్యికి పైగా కరోనా కేసులు..

  • గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1134 కరోనా కేసులు
  • ఐదుగురి మృతి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,026
  • ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • ఇన్‌ఫ్లుయెంజా కేసుల్లోనూ పెరుగుదల నమోదు
భారత్‌లో గత 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మొత్తం 1134 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026. అంతేకాకుండా.. గత 24 నాలుగు గంటల్లో కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ఛత్తీస్‌ఘడ్‌, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒకరు చొప్పున కరోనాకు బలయ్యారు. 

ఇక దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం 83 కరోనా కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 5.83 శాతంగా నమోదైంది. కొద్ది రోజులుగా ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరగడంతో పాటూ హెచ్3ఎన్2 కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. 

భారత వైద్య పరిశోధన మండలి ప్రకారం.. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లల్లోని హెచ్3ఎన్2 సబ్‌టైప్ ఏ ఉపరకం వైరస్ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇతర ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల కంటే హెచ్3ఎన్2 రకం కారణంగా కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ సోకిన వాళ్లల్లో ముక్కు కారడం, వదలని దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.


More Telugu News