51 కిలోల జామకాయలు పంపిస్తే.. చేరింది 27 కిలోలే! టీఎస్ ఆర్టీసీ కార్గో సిబ్బంది నిర్వాకం

  • కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేసిన కస్టమర్
  • విచారించి న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఘటన
టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలను ఉపయోగించుకున్న ఓ కస్టమర్.. సంస్థ సిబ్బంది నిర్వాకంతో అవాక్కయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుంచి 51 కిలోల జామకాయల బుట్టను పంపిస్తే  హైదరాబాద్ చేరేసరికి అదికాస్తా 27 కిలోల బరువు మాత్రమే తూగింది. దీనిపై కార్గో సిబ్బందిని ప్రశ్నిస్తే.. హైదరాబాద్ లో అడిగితే ఇల్లెందులో, ఇల్లెందులో అడిగితే హైదరాబాద్ లోని సిబ్బందినే అడగాలని నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. దీంతో చేసేదేంలేక ఉన్నతాధికారులను ఆశ్రయించాడా వ్యాపారి. వివరాలు..

ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఇల్లెందు బస్టాండ్ లో 51 కిలోల జామకాయల బుట్టను మురళి అనే వ్యక్తి హైదరాబాద్ కు పార్సిల్ చేశారు. ముందుగా తూకం వేసి, సిబ్బంది అడిగిన సొమ్మును చెల్లించాడు. మరుసటి రోజే హైదరాబాద్ చేరాల్సిన ఈ పార్సిల్ ఓ రోజు ఆలస్యంగా.. అంటే ఈ నెల 20న చేరుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఈ పార్సిల్ తీసుకోవడానికి అనిల్ అనే యువకుడు వచ్చాడు. పార్సిల్ తక్కువగా ఉన్నట్లు అనుమానించిన అనిల్.. ఆ బుట్టను తూకం వేయించగా 27 కిలోల బరువు చూపించింది. 51 కేజీలు పంపిస్తే 27 కిలోలే రావడమేంటని సిబ్బందిని అనిల్ నిలదీశాడు. అయితే, తమకేం తెలియదని, పార్సిల్ తీసుకెళ్లాలని సిబ్బంది తేల్చిచెప్పారు. ఇల్లెందులో కార్గో సిబ్బందిని ప్రశ్నించినా అదే జవాబు వచ్చింది.

ఆర్టీసీ కాల్ సెంటర్ ద్వారా మురళి దీనిపై ఫిర్యాదు చేయగా.. విచారిస్తామని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఆర్టీసీ కార్గో బిజినెస్ హెడ్ సంతోష్ మీడియాకు వివరణ ఇచ్చారు. పార్సిల్ విషయంలో ఫిర్యాదు అందిందని, విచారించి పొరపాటు ఎక్కడ జరిగిందనేది కనుక్కుంటామని చెప్పారు. కస్టమర్ కు న్యాయం చేస్తామని సంతోష్ పేర్కొన్నారు.


More Telugu News