45 వేల ఉద్యోగాలు.. ఫ్రెషర్ల ప్రారంభవేతనమే రూ.14 లక్షలు..!

  • ఏఐతో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు
  • డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్
  • ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం
కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) యుగం ప్రారంభమైంది. చాట్‌జీపీటీ, ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్లు ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి. ఇక ఏఐతో ప్రస్తుతమున్న ఎన్నో ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న భయాలు నెలకొన్నాయి. అందులో వాస్తవం లేకపోలేదు. అయితే..ఏఐతో పాత ఉద్యోగాలు కనుమరుగైనా వాటి స్థానంలో కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ రంగంలో భారత్‌లో సుమారు 45 వేల ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయని టీమ్ లీజ్ డిజిటల్ అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. 

ఈ నివేదిక ప్రకారం..  ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు, ఉద్యోగులు డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వైపు మళ్లాల్సి ఉంటుంది. స్కేలబుల్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ల రూపకల్పన, స్క్రిప్టింగ్ లాంగ్వేజస్‌పై పట్టు సాధించిన వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక తేల్చింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో డాటా ఇంజినీర్లుగా చేరే ఫ్రెషర్లకు ప్రారంభవేతనమే ఏటా రూ.14 లక్షలుగా ఉంటుందని సమాచారం. ఇక మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు కూడా రూ.10 లక్షల వార్షిక వేతనం పొందొచ్చు. డెవ్‌ఆప్స్ డెవలపర్లు, డాటా ఆర్కిటెక్టులు, డాటాబేస్ అడ్మిన్స్ తదితర ఉద్యోగాల వార్షిక వేతనం రూ.12 లక్షలు ఉంటుందని ఈ నివేదికలో తేలింది. ఈ రంగాల్లో కనీసం 8 ఏళ్ల అనుభవం ఉన్నవారు ఏటా రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ వేతనం పొందచ్చని కూడా నివేదిక స్పష్టం చేసింది. ఏఐ, ఏఐ ఆధారిత అప్లికేషన్లపై విద్యార్థులకు కనీసం ప్రాథమిక అవగాహన అయినా ఉండాలని, అప్పుడే వారు జాబ్ మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడతారని ఈ నివేదిక పేర్కొంది.


More Telugu News