పాకిస్థాన్ లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు.. వీడియో ఇదిగో!

  • భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్లుగా నమోదు
  • ఢిల్లీలోనూ ప్రకంపనలు.. మంగళవారం అర్ధరాత్రి రోడ్లపైకి జనం
  • ఉత్తరాది రాష్ట్రాలలో స్వల్పంగా కంపించిన భూమి
దాయాది దేశం పాకిస్థాన్ లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5 పాయింట్లుగా నమోదైంది. మంగళవారం రాత్రిపూట భూమి కంపించడంతో పాక్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. దేశంలోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాత్ సిటీలలో భూమి కంపించింది. పలుచోట్ల భవనాలు నేల కూలాయి.

దేశవ్యాప్తంగా భూకంపం కారణంగా తొమ్మిది మంది చనిపోయారని, మరో 160 మంది గాయపడ్డారని పాక్ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో రావల్పిండిలోని మార్కెట్ లోని జనం భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు, ఆఫ్ఘానిస్థాన్, భారత్, తుర్కెమెనిస్థాన్, కజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిజిస్థాన్ లలో కూడా భూకంప ప్రభావం కనిపించిందని ఇంటర్నేషనల్ సిస్మలాజికల్ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది.

పాక్, ఆఫ్ఘాన్ లలో సంభవించిన భూకంప ప్రభావం భారత్ లోనూ కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలలో భూమి స్వల్పంగా కంపించింది. ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనాలలో నివసించే ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి చేరుకున్నారు. రాత్రిపూట చాలాసేపు జనం రోడ్లపైనే ఉండిపోయారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోని జనం భూకంపానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


More Telugu News