తీన్మార్ మల్లన్నను ఎత్తుకెళ్లింది ఎవరు?.. పోలీసులా? గూండాలా?: బండి సంజయ్

  • గత రాత్రి క్యూన్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాలు
  • మల్లన్న, తెలంగాణ విఠల్‌ను తీసుకెళ్లినట్టు ఆరోపణలు
  • మల్లన్న, విఠల్‌ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్
  • వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతోపాటు తెలంగాణ విఠల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మల్లన్న కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రాజకీయ పార్టీలా కాకుండా గూండా పార్టీలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడిచేసి కంప్యూటర్లు ఎత్తుకుపోవడం దుర్మార్గమన్నారు. తనకు విషయం తెలిసిన వెంటనే తీన్మార్ మల్లన్న, విఠల్ ఇంటికి వచ్చినట్టు చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా కేసీఆర్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని అన్నారు. మీడియా కూడా కేసీఆర్ ఒత్తిడితోనే పనిచేస్తోందని, మీడియా ఏదైనా ప్రజలు దానిని విశ్వసించడం లేదని అన్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై సోదాలు, దాడి విషయాన్ని హైలైట్ చేయకపోవడానికి అదే కారణమన్నారు. 

తీన్మార్ మల్లన్న తప్పు చేస్తే కేసులు పెట్టి శిక్షించాలని, అంతేకానీ దొంగలా ఎత్తుకుపోవడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో కేటీఆర్ హస్తం ఉందని తీన్మార్ మల్లన్న చెబుతున్నందుకే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఎత్తుకెళ్లింది పోలీసులా? గూండాలా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News