దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు: చంద్రబాబు

  • మార్చి 22న ఉగాది
  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభం
  • తెలుగు రాష్ట్రాలకు ప్రగతి శోభ రావాలన్న చంద్రబాబు
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఘడియలు మరికొన్ని గంటల్లో ముగియనుండగా, శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభ ఘడియలు ప్రవేశించనున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. 
తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలతో పాటు...దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనందరం శోభకృత్ నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. శోభను కలిగించేది శోభకృత్. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు ప్రగతి శోభ రావాలి. చీకట్లు తొలగిపోయి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నవోదయం రావాలి.

ప్రకృతిలో కలిగే మార్పుకు సంకేతంగా ఉగాది జరుపుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా కొత్త ఏడాది శుభప్రదమైన మార్పును తేవాలని ఆకాంక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో కొత్త ఏడాది పెనుమార్పులు తేబోతుంది అని ఉగాదికి మూడు రోజుల ముందే మనకు అర్థం అయ్యింది. ప్రజలు ఉగాది పంచాంగం ముందే చెప్పేశారు. ఇది రాష్ట్రానికి శుభసూచకం. శుభప్రదమైన ఆ మార్పును స్వాగతిద్దాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ...తెలుగు ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.
అంటూ సందేశం వెలువరించారు.


More Telugu News