పవన్ కల్యాణ్ మాతో కలిసి రావడంలేదు: బీజేపీ నేత మాధవ్

  • జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనన్న మాధవ్
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తమతో కలిసి రాలేదని ఆరోపణ
  • పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు అంటూ ప్రచారం జరిగిందని వెల్లడి
  • ఈ ప్రచారాన్ని జనసేన ఖండించలేదని వ్యాఖ్యలు 
ఏపీలో బీజేపీ-జనసేన భాగస్వామ్యంపై బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని వ్యాఖ్యానించారు. ఏపీలో పేరుకే రెండు పార్టీల మధ్య పొత్తు అన్నట్టుగా పరిస్థితి తయారైందని అన్నారు. 

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందని, దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదు అనేది బీజేపీ ఆరోపణ అని తెలిపారు. జనసేన, బీజేపీ కలసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు. 

బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా పంపిందని, దాంతో ఏపీ బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్మారని మాధవ్ వివరించారు. వైసీపీ వేసిన ఎత్తుగడను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని, ఈ అపవాదును తొలగించుకుంటామని చెప్పారు.


More Telugu News