2019 నుంచి 2023 వరకు.. ‘మేం ఓటమి, వాళ్లు గెలుపు’ చూడలేదన్న మంత్రి అమర్నాథ్

  • ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి
  • భారత జట్టుపై ఎప్పుడో ఓసారి కెన్యా మ్యాచ్ గెలుస్తుందని వ్యాఖ్య
  • చాలాకాలం తర్వాత వచ్చిన విజయానికి పొంగిపోవడం సహజమేనని వివరణ
  • మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్లా టీడీపీ గెలవడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో ఓసారి వచ్చే గెలుపును చూసి పొంగిపోవద్దని, వచ్చే జనరల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు వస్తాయని, రావాలని కోరుకోవడం దురాశేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్‌తో మంత్రి పోల్చిచెప్పారు. భారత జట్టుతో పది మ్యాచ్ లు జరిగితే ఏదో ఒక మ్యాచ్ లో కెన్యా జట్టు గెలవొచ్చని మంత్రి తెలిపారు. అయితే, ప్రతీ మ్యాచ్ లోనూ కెన్యా జట్టు గెలుస్తుందని ఆశించడం అత్యాశేనని అన్నారు. కెన్యా గెలిచినట్లే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని మంత్రి వ్యాఖ్యానించారు.

2019 నుంచి 2023 వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి చూడలేదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదే కాలంలో ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచిందేలేదని చెప్పారు. అలాంటిది.. గెలవక గెలవక గెలిచినపుడు ఉప్పొంగిపోవడం సహజమేనని మంత్రి వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సెక్టార్‌కు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. అవి కేవలం 2 శాతం వర్గానికి సంబంధించినవే, అందులోనూ తమకు 36 శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే, ఎంత తేడాతో ఓడిపోయినా ఓటమి ఓటమేనని మంత్రి చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీలో సమీక్ష జరుపుతామని అమర్నాథ్ తెలిపారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్థాపించడం ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం స్కాంకి శ్రీకారం చుట్టిందని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. నారా వారిదే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అని విమర్శించారు. దేశంలోనే ఇది అతిపెద్ద స్కాం అని, ఈ విషయం ప్రజలకు తెలియాలని మంత్రి చెప్పారు. తాము ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ కోసం 25 కోట్లు ఖర్చు పెడితే.. టీడీపీ వందల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తండ్రీ కొడుకులు అవినీతికి పాల్పడ్డారని.. వారికి అవినీతిలో నోబెల్ ప్రైజ్, నటనలో ఆస్కార్ ఇవ్వాలని మంత్రి ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో డిజైన్ టెక్ అనే కంపెనీ నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.


More Telugu News