ఏ భంగిమలో నిద్రించడం మంచిది..?

  • వెల్లకిలా పడుకోవడం వల్ల లాభ, నష్టాలు
  • పక్కకు తిరిగి పడుకోవడం అన్ని విధాలుగా మంచిది
  • ముఖ్యంగా ఎడమ చేతివైపు తిరిగి నిద్రించాలి
  • బోర్లా పడుకుంటే సమస్యలను ఆహ్వానించినట్టే
శరీరంలో జీవక్రియల మరమ్మతులకు నిద్ర ఎంతో అవసరం. మరుసటి రోజుకి మన శరీరాన్ని రీచార్జ్ చేసేది నిద్ర. ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో నిద్రించడం చూస్తుంటాం. కానీ, నిజానికి ఇలా ఏదో ఒక భంగిమలో నిద్రించడం సరైనది కాదు. మన వెన్నెముకపై భారం పడకుండా చూసుకోవాలి. గుండెపై భారం పడకుండా చూసుకోవాలి. వాటిపై భారం పడితే దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

పడుకునే తీరుతో లాభ, నష్టాలున్నాయి. అనారోగ్యాలు తెచ్చుకోవద్దంటే వైద్యులు సూచిస్తున్న భంగిమలను ఆశ్రయించడం మంచిది. సరైన భంగిమలో నిద్రించకపోవడం వల్ల మెడ నొప్పి, భుజాల నొప్పి, నడుం నొప్పి, గురక తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. 

వెల్లకిలా..
 ఇది సాధారణ నిద్ర భంగిమ. దాదాపు అందరూ ఇలా కొంత సమయం పాటైనా నిద్రిస్తుంటారు. ఇది మన భంగిమను సరి చేస్తుంది. మెడ నొప్పిని నివారిస్తుంది. తలగడ పెట్టుకుని తలను పైకి ఎత్తి ఉంచే భంగిమతో అసిడిటీ, గ్యాస్ సమస్యలు రావచ్చు. స్లీప్ అప్నియా సమస్యను ఇది పెద్దది చేస్తుంది. ఈ భంగిమ నిజానికి వెన్నెముకకు అనుకూలం కాదు. సాధారణంగా రోజంతా మనం వెన్నెముకపైనే భారం వేస్తుంటాం. రాత్రి నిద్ర సమయంలో అయినా వెన్నెముకకు విశ్రాంతినివ్వడం ఎంతో అవసరం.

పక్కకు తిరిగి పడుకోవడం
 అన్నింటిలోకి పక్కకు తిరిగి నిద్రించడం మంచి విధానం. ఎడమ చేతి వైపు తిరిగి పడుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. గర్భిణులు ఎడమ చేతివైపు తిరిగి పడుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెప్పాయి. తల్లీ, కడుపులోని శిశువుకు ఆక్సిజన్ సరఫరా కూడా పెరుగుతుంది. సైనస్ సమస్యలున్న వారు కూడా పక్కకు తిరిగి పడుకోవడం ఉపయోగకరం. గురక సమస్య కూడా తగ్గుతుంది. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో నడుము, మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. 

బోర్లా పడుకోవడం
 అసలు పడుకోకూడని భంగిమ ఇది. వెన్నెముకకు ఈ విధానం ఎంతో హాని చేస్తుంది. నిద్రకు సాయపడే పొట్ట భాగంలోని కండరాలపై ఒత్తిడి పడుతుంది. గుండె కండరాలపైనా ఒత్తిడి పడుతుంది.


More Telugu News