బాబోయ్ బంగారం.. భారీగా పెరిగిన పసిడి ధర!

  • అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి
  • ఒక దశలో 2005 డాలర్లకు పెరిగిన ఔన్సు బంగారం ధర
  • సాయంత్రానికి దేశీయంగా రూ. 61,300కు దిగి వచ్చిన మేలిమి బంగారం ధర
భారత్‌లో బంగారం ధరలు మరోమారు షాకిచ్చాయి. నిన్న ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 60 వేల మార్కును దాటేసి వినియోగదారులకు గుబులు పుట్టించింది. అమెరికా, స్విట్జర్లాండ్‌లలో బ్యాంకులు దివాలా తీయడం, అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా పెరగనున్నాయనే వార్తలతో స్టాక్‌మార్కెట్లు నష్టపోతున్నాయి. ఫలితంగా ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం, వెండిపైకి పెట్టుబడులు మళ్లుతుండడంతో వీటి ధరలు భగ్గుమంటున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్సు (31.30 గ్రాములు) ధర ఒక దశలో 2005 డాలర్లకు పెరిగింది. దీనికి తోడు రూపాయి మారకంతో పోలిస్తే డాలర్ విలువ రూ. 82.56కు చేరుకోవడంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 62 వేలకు పెరిగింది. అయితే, సాయంత్రానికి ధర కొంచెం తగ్గుముఖం పట్టి ఔన్సు ధర 1,978 డాలర్లకు పడిపోవడంతో దేశీయంగా 10 గ్రాముల రూ. 61,300కు దిగివచ్చింది.  వెండి కిలో రూ. 70,500కు చేరుకుంది.

అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు కుప్పకూలిన తర్వాత బంగారం ధర 8 శాతం పెరిగింది. అలాగే, తీవ్ర ఒత్తిడిలో ఉన్న క్రెయిడ్ సూయిస్‌ గ్రూప్ ఏజీని స్విట్జర్లాండ్‌కు చెందిన యూవీఎస్ కొనుగోలు చేయబోతోందన్న వార్త నిన్న లాభాలను కొంత పెంచింది. దీంతో పెట్టుబడిదారులు ఊపిరిపీల్చుకున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం బ్యాంకుల పతనాన్ని ఎత్తి చూపితే, క్రెడిట్ సూయిస్ షేర్ల పతనం మార్కెట్లో మరింత కల్లోలం రేపిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 62 వేల నుంచి 63 వేల మధ్య ఆగే అవకాశం ఉందన్నారు. 

ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి వైపు మళ్లుతుండడంతో అనిశ్చిత సమయాల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం వార్తల తర్వాత నిఫ్టీ, సెన్సెక్స్ షేర్లు 3 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,050-2080 డాలర్లుగా ఉంది.  

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా.. 
చెన్నైలో 22 కేరెట్ల బంగారం ధర రూ. 55,800 కాగా, 24 కేరెట్ల మేలిమి బంగారం ధర రూ. 60,870. ముంబైలో వరుసగా రూ.54,800, రూ.59,780గా ఉంది. ఢిల్లీలో 22 కేరెట్ల బంగారం ధర రూ. 54ర,950, 24 కేరెట్ల పసిడి ధర రూ. 59,930గా ఉంది. కోల్‌కతాలో వరుసగా రూ. 54,800, రూ. 59,780, హైదరాబాద్‌లో రూ.54,800, రూ. 59,780, విజయవాడలో రూ. 54,800, రూ. 59,780, విశాఖపట్టణంలో రూ. 54,800, రూ. 59,780గా ఉంది. గుంటూరులో రూ. 54,800, రూ. 59,780గా ఉంది. తిరుపతిలో ఆభరణాల బంగారం ధర రూ. రూ. 54,800 కాగా, 24 కేరెట్ల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 59,780గా ఉంది. వరంగల్‌లో వరుసగా రూ. 54,800, రూ.59,780గా ఉంది.


More Telugu News