​​సొంత ఆర్ఆర్ఆర్ లో నటించి ఉంటే జగన్ కు ఆస్కార్ వచ్చేది: లోకేశ్

  • కదిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • భుజం గాయంతో బాధపడుతున్న లోకేశ్
  • అయినప్పటికీ అభిమానులకు ఓపికగా సెల్ఫీలు
  • వివిధ వర్గాలకు హామీలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 48వ రోజు (సోమవారం) కదిరి నియోజకవర్గంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగింది. పాదయాత్ర జోగన్నపేట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. విడిది కేంద్రం వద్ద తనను కలిసేందుకు వచ్చిన సుమారు వెయ్యిమంది అభిమానులతో యువనేత ఓపిగ్గా ఫోటోలు దిగి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. భుజం వద్ద గాయంతో ఇబ్బంది పడుతున్నా అభిమానులను నిరాశపర్చకూడదని భావించి ప్రతిఒక్కరికీ సెల్ఫీ ఇచ్చారు.

అన్నా క్యాంటీన్ ప్రారంభించిన లోకేశ్ 

శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను నారా లోకేశ్ నేడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్యాంటీన్ లోపల ఉన్న ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. స్థానికులకు భోజనం వడ్డించి క్యాంటీన్ లో అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ఎవరూ ఆకలితో ఉండరాదన్న సదుద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటుచేస్తే జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వంతో వాటిని రద్దుచేశారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, అభిమానులు సొంత డబ్బుతో అన్నా క్యాంటీన్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 

లోకేశ్ హామీలు...

  • అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతాం
  • వడ్డెర్ల వృత్తి పని కోసం క్వారీలు కేటాయిస్తాం
  • మద్యం షాపుల్లో కల్లుగీత కార్మికులకు రిజర్వేషన్ అమలు చేస్తాం
  • నిలచిపోయిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేస్తాం
  • టీడీపీప్రభుత్వం వచ్చాక మళ్లీ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకువచ్చి బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం.
  • షరతుల్లేకుండా దుల్హాన్ పథకాన్ని అమలు చేస్తాం
  • మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం
  • బీడీ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చిత్తూరు పర్యటనలో హామీ ఇచ్చాను. 
  • కదిరిలో ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసి వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం.

ట్రిపుల్ ఆర్ లో నటించి ఉంటే ఆస్కార్ వచ్చేది!

రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని లోకేశ్ అభివర్ణించారు. మాట మార్చడం... మడమ తిప్పడం లో జగన్ దిట్ట అని విమర్శించారు. సొంత ఆర్ఆర్ఆర్ లో జగన్ నటించి ఉంటే ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చేదని వ్యంగ్యం ప్రదర్శించారు. "బాబాయ్ ని చంపేసి చంద్రబాబు గారు చంపేశారు అంటూ నటించాడు. ఒక కంటిని పొడుచుకుంటామా అంటూ యాక్టింగ్ చేశాడు. ఒక్కో సారి జగన్ ఢిల్లీ వెళ్ళడానికి రూ.కోటి ఖర్చు అవుతుంది. ప్రత్యేక హోదా గురించి అడగడు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అడగడు. జగన్ కి సౌండ్ ఎక్కువ పని తక్కువ" అంటూ ఎద్దేవా చేశారు.

దళిత ఎమ్మెల్యేని శాసనసభ సాక్షిగా అవమానించారు!

సమస్యలపై పోరాడుతున్నందుకు దళిత శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ గూండా ఎమ్మెల్యేలు దాడిచేశారని లోకేశ్ మండిపడ్డారు. ఆనాడు శాసనసమండలిలో చైర్మన్ షరీఫ్ ను ఓ మంత్రి దారుణంగా అవమానించారని వెల్లడించారు. "మైనారిటీలను గౌరవించాలని మనసులో ఉండాలి. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు మైనారిటీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించారు" అని వెల్లడించారు.

దివ్యాంగుల బాలలతో ముచ్చటించిన లోకేశ్

కదిరి నియోజకవర్గం మొటుకుపల్లి గ్రామంలో ఆర్డీటీ ట్రస్ట్ నిర్వహిస్తున్న దివ్యాంగుల ఆశ్రమాన్ని లోకేశ్ సందర్శించారు. దివ్యాంగ పిల్లలతో సరదాగా ముచ్చటించి వారికి స్వీట్లు, చాక్లెట్లు పంచారు. మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఎలా చదువుతున్నారు, టీచర్లు బాగా చెబుతున్నారా అంటూ పిల్లలను కుశలప్రశ్నలు వేశారు. టీచర్లను గౌరవించాలని... వారు మనకోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఆశ్రమంలో పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్ కు దివ్యాంగ చిన్నారులు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో లోకేశ్ మురిసిపోయారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలు, సిబ్బందితో యువనేత సరదాగా ఫోటోలు దిగారు.

లోకేశ్ ను కలిసిన ఆర్యవైశ్య ప్రముఖులు

కదిరి దేవళం బజారులో నారా లోకేశ్ ను ఆర్యవైశ్య ప్రముఖులు కలిసి సమస్యలు విన్నవించారు. వ్యాపారం నిర్వహణలో ఎదుర్కుంటున్న సమస్యలు లోకేశ్ కి తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.... ఆర్యవైశ్యులు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు. "జగన్ పాలనలో వ్యాపారాలు నిర్వహించడం ఎంత కష్టంగా మారిందో నాకు తెలుసు. పెరిగిన విద్యుత్ బిల్లులు, వైసీపీ నేతల బెదిరింపులు, చెత్త పన్ను, పన్నుల భారంతో వ్యాపారాలు నిర్వహించడం మీకు భారంగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై అదనంగా మోపిన భారాన్ని తగ్గిస్తాం. వేధింపులు లేకుండా చేస్తాం" అని భరోసా ఇచ్చారు.

=====

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 612.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 9.8 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 49వ రోజు షెడ్యూల్ (21-3-2023)*

*కదిరి నియోజకవర్గం (శ్రీ సత్యసాయి జిల్లా).*

ఉదయం

8.00 – కదిరి ఆర్డీఓ కార్యాలయం సమీపాన విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – ముత్యాలమ్మ చెరువులో టిడ్కో గృహాల పరిశీలన, లబ్ధిదారులతో భేటీ.

8.45 – ఆలీపూర్ తండా వద్ద స్థానికులతో మాటామంతీ.

10.40 – ముత్యాలమ్మ చెరువు వద్ద స్థానికులతో మాటామంతీ.

11.30 – ముత్యాలమ్మ చెరువు వద్ద భోజన విరామం.

మధ్యాహ్నం 

2.30 – ముత్యాలమ్మ చెరువు వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

3.30 – పుట్టపర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

3.45 –పులగంపల్లి వద్ద స్థానికులతో మాటామంతీ.

4.50 – మిట్టపల్లి వద్ద దివ్యాంగులతో భేటీ.

5.45 – గొనుకువారిపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.


More Telugu News