టికెట్ అడిగిన వెంటనే నారా లోకేశ్ ఓకే చెప్పారు: పశ్చిమ రాయలసీమ టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి

  • రాయలసీమ పశ్చిమ స్థానం నుంచి రామగోపాల్ రెడ్డి గెలుపు
  • నారా లోకేశ్ నిరంతరం సమీక్ష నిర్వహించారన్న కొత్త ఎమ్మెల్సీ
  • రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి గెలిచానని వ్యాఖ్య
ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పశ్చిమ రాయలసీమ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. రామగోపాల్ రెడ్డికి ఏడాదిన్నర క్రితమే ఎమ్మెల్సీ టికెట్ ఖరారు అయింది. తాజాగా ఆయన మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అడిగిన వెంటనే నారా లోకేశ్ ఓకే చెప్పారని... తన భుజం తట్టారని తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత నిరంతరం సమీక్ష జరిపారని చెప్పారు. 

ఓటరు నమోదులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్నారు. కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తున్న టీడీపీకి ఓటు వేయొద్దని వైసీపీ ప్రచారం చేసిందని... అయితే పరిస్థితులను అందరికీ వివరించామని చెప్పారు. ధనుంజయరెడ్డి అనే కార్యకర్త పోలీసులు టార్చర్ చేస్తున్నా టీడీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేశాడని కొనియాడారు. రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి గెలిచానని చెప్పారు. 

టీడీపీ ఏజెంట్లపై వైసీపీ వాళ్లు దాడి చేస్తే... వాళ్లను ఏమీ చేయకుండా టీడీపీ వాళ్లనే కొడుతూ పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అవసరమైతే ప్రతి దాడులకు కూడా తామంతా సిద్ధపడ్డామని చెప్పారు. తాను గెలిచిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు ధర్మమే గెలిచిందని చెప్పారు. టీడీపీకి ఓటర్లు బ్రహరథం పట్టడం రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతోందో సూచిస్తోందని అన్నారు.


More Telugu News