రావణాసురులను ఎలా సంహరించాలో జగన్ కు తెలుసు: తమ్మినేని సీతారాం

  • టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేసేందుకు యత్నించారన్న స్పీకర్ తమ్మినేని
  • సభాపతి స్థానం పట్ల గౌరవం లేకుండా వ్యవహరించారని మండిపాటు
  • తాను గౌతమ బుద్ధుడిని కాదని వ్యాఖ్య
వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణతో ఏపీ అసెంబ్లీ ఈరోజు అట్టుడుకింది. వైసీపీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని టీడీపీ సభ్యులు చెపుతుండగా... టీడీపీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని వైసీపీ సభ్యులు చెపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేసేందుకు యత్నించారని చెప్పారు. తనపై విసిరేసిన కాగితాలను తాను పుష్పాలుగా భావించానని... అయినా, తానేమీ గౌతమ బుద్ధుడిని కాదని అన్నారు. 

శాసనసభలో శ్రీరాముడు వంటి సీఎం జగన్ ఉన్నారని.. రావణాసురులను ఎలా సంహరించాలో ఆయనకు తెలుసని చెప్పారు. టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ, వారు ప్రవర్తించిన తీరు ఏ మాత్రం సరికాదని విమర్శించారు. సభాపతి స్థానం పట్ల గౌరవం లేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఎవరైనా సభ్యులు పోడియం వద్దకు లేదా స్పీకర్ స్థానం వద్దకు వస్తే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయ్యేలా రూల్ ఉందని చెప్పారు.


More Telugu News