పాట రాసి తీసుకెళితే నా ముఖంపై విసిరికొట్టారు: భువనచంద్ర

  • పాటల రచనలో భువనచంద్ర సాహిత్యం ప్రత్యేకం 
  • 'ప్రాణ స్నేహితులు' సినిమాను గురించిన ప్రస్తావన
  • మధుసూదనరావుగారు కోప్పడ్డారని వెల్లడి 
  • అదంతా ఆత్రేయ చలవేనని వివరణ

తెలుగు పాటకి తన పాళీతో పదును పెట్టిన పాటల రచయితగా భువనచంద్రకి మంచి పేరు ఉంది. సున్నితమైన బంధాలను గురించే కాదు .. శృంగార రసానికి సంబంధించిన పాటలను సైతం పరుగులు తీయించినవారాయన. 'ఐ డ్రీమ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. కృష్ణంరాజుగారి 'ప్రాణస్నేహితులు' సినిమాలో స్నేహానికి సంబంధించిన ఒక ట్యూన్ ను ఆత్రేయగారికి పంపించారు. పొరపాటున అదే ట్యూన్ ను నాకు కూడా పంపించారు.

'స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా' అంటూ నేను పాటను రాసేశాను. ఆ పాటను తీసుకుని వెళ్లి దర్శకుడు వి. మధుసూదనరావు గారికి వినిపించాను. అసలు ఈ పాటను మిమ్మల్ని ఎవరు రాయమన్నారంటూ ఆయన ఆ పాటను నా ముఖం పైకి విసిరికొట్టారు. అప్పుడు నాకు పంపించిన ట్యూన్ ను ఆయనకి వినిపించాను. పొరపాటున అలా జరిగి ఉంటుందంటూ నాకు వేరే పాట ఇచ్చారు. జరిగిన సంగతిని నేను ఆత్రేయగారికి చెప్పాను. 

అప్పుడు ఆయన స్నేహం గురించి ఏం రాశావో చెప్పమని అడిగారు. దాంతో నేను ఆయనకి ఆ పాటను వినిపించాను. ఆ పాటను విన్న తరువాత, మొత్తం పాటలను నాతోనే రాయించమని మధుసూదనరావు గారికి చెప్పారు. అలా ఆ సినిమాతో పాటల రచయితగా నాకు సింగిల్ కార్డు పడింది. అది ఆత్రేయ గారి గొప్పతనం .. హిమాలయం వంటి అయన ముందు నేను ఎప్పుడూ గులకరాయినే'' అంటూ చెప్పుకొచ్చారు.



More Telugu News