వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్

  • ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా చూపడంపై సవాల్
  • సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని ఆరోపణ
  • హత్యలో కీలక పాత్ర పోషించిన నిందితుడికి బెయిల్ ఇవ్వడం సరికాదు
వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో ఏ-4 నిందితుడిగా చూపిన దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని కోర్టులో సవాల్ చేశారు. సీబీఐ అడిగినట్లు దస్తగిరి స్టేట్ మెంట్ ఇస్తున్నాడని, ఆ స్టేట్ మెంట్ ఆధారంగా తమను నేరంలోకి నెడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఆ స్టేట్ మెంట్ ఆధారంగానే ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించారు.

వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని, అలాంటి నిందితుడికి బెయిల్ ఇవ్వడం సరికాదని భాస్కర్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకించాలన్నారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే.. దస్తగిరి బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించిందని ఆరోపించారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్ట్ పట్టించుకోలేదన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‎ను రద్దు చేయాలని పిటిషన్ లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.


More Telugu News