నేను సొంత బ్యానర్ పెట్టడం దాసరిగారికి ఇష్టం ఉండేది కాదు .. ఎందుకంటే!: మోహన్ బాబు

  • తనకి ఎవరూ సాయం చేయలేదన్న మోహన్ బాబు 
  • సొంత బ్యానర్ ఏర్పాటుకు కారణం అదేనని వ్యాఖ్య 
  • 'సన్నాఫ్ ఇండియా' ఒక ప్రయోగమని వెల్లడి 
  • 'జిన్నా' ఫ్లాప్ కి కారణం తెలియలేదన్న మోహన్ బాబు 

మోహన్ బాబు .. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన నటుడు. ఏ పాత్రను పోషించినా తనదైన ముద్రవేసి వదిలే విలక్షణ నటుడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరియర్ గురించిన అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. "కెరియర్ పరంగా చూసుకుంటే నాకు ఎవరూ ఎలాంటి సాయం చేయలేదు. కష్టం వచ్చినప్పుడు .. నష్టం వచ్చినప్పుడు ప్రకృతి మాత్రమే నాకు సాయం చేసింది" అని అన్నారు. 

" సినిమాలు చేసే నేను సంపాదించాను .. కొన్ని సినిమాలు తీయడం వలన వచ్చిన నష్టాల కారణంగా మంచి మంచి ఆస్తులు అమ్ముకున్నాను. మళ్లీ సంపాదించగలుగుతాను అనే ధైర్యంతో ముందుకు వెళ్లాను .. అనుకున్నది సాధించగలిగాను. నా సీనియర్ హీరోలు సొంత బ్యానర్లు పెట్టడం చూసి నేను కూడా  సొంత బ్యానర్ ను స్థాపించాను. ఈ విషయంలో ఏ హీరోను నేను స్ఫూర్తిగా తీసుకోలేదు. నేను సొంత బ్యానర్ పెట్టడం దాసరి గారికి ఇష్టం ఉండేది కాదు .. వీడు ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటాడో అనే ఒక భయం ఆయనకి ఉండేది" అని చెప్పారు. 

"అప్పట్లో నా సొంత బ్యానర్లో ఏ సినిమా తీసినా సూపర్ హిట్. ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపులు వస్తున్నాయి. ఎక్కడో .. ఏదో తప్పు జరుగుతోంది. ఈ విషయంలో ప్రేక్షకులను తప్పుపట్టడానికి లేదు. 'సన్నాఫ్ ఇండియా' సినిమా ఒక ప్రయోగం అని ముందే చెప్పాను. అందువలన ఆ సినిమా పోయినా నాకు పెద్ద బాధగా అనిపించలేదు. కానీ 'జిన్నా' ఎందుకు ఫెయిల్ అయిందనేది అర్థం కాలేదు" అంటూ తన మనసులోని మాటను బైటపెట్టారు. 


 


More Telugu News