నోటి నుంచి దుర్వాసన.. ఇలా చేస్తే పరిష్కారం

  • పరిశుభ్రతపై దృష్టి లేకపోవడం వల్లే దుర్వాసన 
  • ఆహారం తీసుకున్న తర్వాత తప్పకుండా బ్రష్ చేయాలి
  • వెనిగర్ తో నోటిని పుక్కిలించితే తాత్కాలిక పరిష్కారం
  • చిగుళ్ల సమస్యలు, దంతాల్లో పుచ్చులుంటే చికిత్స తీసుకోవాలి
కొందరు మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్న వారికి నరకం కనిపిస్తుంది. సంభాషణ త్వరగా ముగించి పారిపోవాలని అనిపిస్తుంది. దీనికి కారణం నోటి నుంచి వెలువడే దుర్వాసనే. నిజానికి తమ నోటి నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే పరిశీలించుకుంటే తప్ప తమ నోటి దుర్వాసన గురించి తెలియదు. నేడు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం. కనుక నోటి నుంచి దుర్వాసనకు కారణాలు, నివారణోపాయాలు తెలుసుకుందాం.

కారణాలు
నోటిలో అనారోగ్యం, ముక్కుకు సంబంధించి అలెర్జీలు, సైనస్, అడినాయిడ్స్ తదితర సమస్యలు, గొంతులో సమస్యలు, కొన్ని రకాల ఔషధాల సేవనం, జీవక్రియల సమస్యలు, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్, నోటిని శుభ్రంగా బ్రెష్ చేయకపోవడం, పళ్లల్లో తిన్న ఆహారం ఇరుక్కుని పాడవ్వడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే పొగాకు ఉత్పత్తులు నమిలే అలవాటు, పొగతాగడం వల్ల కూడా చెడు వాసన వస్తుంది. మన నోటిలోని లాలాజలం సాధారణంగా నోటిని శుభ్రం చేస్తుంటుంది. నోటిలో తగినంత లాలాజలం ఉత్పత్తి కాని వారిలోనూ దుర్వాసన వస్తుంది. మద్యపానం, కొన్ని రకాల ఔషధాలు, ఇతర వైద్య కారణాలతోనూ దుర్వాసన వస్తుంది. కూల్ డ్రింక్స్, సోడాలు, కాఫీలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఆల్కహాల్ తీసుకునే వారిలోనూ కనిపిస్తుంది. పళ్లు పుచ్చినా కానీ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. పళ్లపై పాచి పేరుకుపోయి జింజివైటిస్ వల్ల, చిగుళ్ల సమస్యల్లోనూ దుర్వాసన వెలువడుతుంది. 

నివారణ
అసలు నోటి నుంచి దుర్వాసన వస్తుందా..? తెలుసుకునేందుకు నోటికి చేయి అడ్డంగా పెట్టుకుని గట్టిగా ఊదితే తెలుస్తుంది. చెడు వాసన వస్తుంటే దానికి కారణాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా నోటిని సరిగ్గా బ్రష్ చేయనివారిలో ఇది కనిపిస్తుంది. కనుక మంచి నాణ్యమైన బ్రష్ తో రోజూ ఆహారం తీసుకున్న ప్రతిసారీ బ్రష్ చేసుకోవాలి. అన్నింటిలోకీ ఇది మెరుగైన పరిష్కారం. వెనిగర్ తో నోటిని పుక్కిలించినా ఫలితం ఉంటుంది. కాకపోతే ఇది తాత్కాలికమే. పళ్లకు ఫ్లాసింగ్ చేసుకోవాలి. అప్పుడు పళ్ల మధ్య ఏవి ఇరుక్కున్నా బయటకు వచ్చేస్తాయి. దుర్వాసన వచ్చేవారు చక్కెర పానీయాలను మానేయాలి. తగినంత నీరు తాగడం వల్ల నోటిలో లాలాజలం మంచిగా ఉత్పత్తి అవుతుంటుంది. కనుక తగినంత నీరు తీసుకునే వారిలో ఈ సమస్య తక్కువగా వస్తుంది. తిన్న తర్వాత నోటిని బాగా పుక్కిలించి ఉమ్మేసినా ఫలితం కనిపిస్తుంది. నోరు ఎండిపోయినప్పుడు దుర్వాసన రావచ్చు. కనుక తరచూ నీరు తాగుతుండాలి. అవసరమైతే ఒకసారి డాక్టర్ ను సంప్రదించి దంతాలను పూర్తిగా చెక్ చేయించుకోవాలి. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తోనే బ్రష్ చేయాలి.  



More Telugu News