వరి పొలంలో భారీ మొసలి.. రైతులకు ముప్పుతిప్పలు

  • వనపర్తి జిల్లా వెల్లూరులో ఘటన
  • పొక్లెయిన్ సాయంతో మొసలిని పొలం నుంచి బయటకు తీసిన వైనం
  • తాళ్లతో బంధించి జూరాల ప్రాజెక్టులో వదిలిన రైతులు 
వరి పొలంలో కనిపించిన ఓ భారీ మొసలి రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్దూరులో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి నిన్న గ్రామ సమీపంలోని చెరువు వెనక ఉన్న వరిపొలం వద్దకు వెళ్లారు. పొలం గట్టుపై నడుస్తున్న సమయంలో పొలంలో భారీ మొసలి ఒకటి కనిపించడంతో ఆయన గుండెలు ఆగిపోయినంత పనైంది. గట్టుపై అలికిడి కావడంతో మొసలి పక్కనే ఉన్న సర్పంచ్ శ్రీనివాసరెడ్డి పొలంలోకి వెళ్లిపోయింది.

అది చూసిన బాల్‌రెడ్డి వెంటనే సర్పంచ్‌కు ఫోన్ చేసి పొలంలో భారీ మొసలి ఒకటి ఉన్నట్టు చెప్పారు. ఆయన వెంటనే వనపర్తిలోని ‘సాగర్ స్నేక్ సొసైటీ’ నిర్వాహకుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. వెంటనే పొలం వద్దకు చేరుకున్న ఆయన మొసలిని బంధించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో వెంటనే ఓ పొక్లెయిన్‌ను తెప్పించి మొసలిని బయటకు తీశారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పొక్లెయిన్‌తో బయటకు తీసిన మొసలిని అందరి సహకారంతో తాళ్లతో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారుల ఆదేశాలతో దానిని జూరాల ప్రాజెక్టులో వదిలిపెట్టారు.


More Telugu News