21 కిలోమీటర్లకు రూ.1,525 బిల్లు వేసిన ఉబర్... కారణమిదేనట!

  • ఢిల్లీలో క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికురాలికి షాకిచ్చిన ఉబెర్
  • జీపీఎస్ ఎర్రర్ వల్ల భారీ బిల్లు వచ్చిందని వెల్లడి
  • యూపీ ఇంటర్ స్టేట్ చార్జ్, మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ కూడా వేసిన వైనం
  • రూ.900 వెనక్కి ఇస్తామని చెప్పి... ‘ఉబెర్ క్యాష్’ కింద క్రెడిట్ చేసిన కంపెనీ
ఢిల్లీలో క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికురాలికి ఉబెర్ కంపెనీ షాకిచ్చింది. కేవలం 21 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా రూ.1,525 చార్జ్ చేసింది. ఇదేంటని అడిగితే జీపీఎస్ ఎర్రర్ అని చెప్పుకొచ్చింది. దీంతో కంగుతినడం ప్రయాణికురాలి వంతు అయింది.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్ కు ఓ మహిళ ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రయాణ దూరం 21 కిలోమీటర్లు. తీరా అక్కడికెళ్లాక బిల్లు రూ.1,525 రావడంతో ఆమె  దిగ్భ్రాంతికి గురయింది. క్యాబ్ డ్రైవర్ బిల్లు చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో, ఆ బిల్లు చెల్లించకతప్పలేదు. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. 

జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తప్పు వల్ల ఇలా జరిగిందని కంపెనీ ప్రతినిధులు ఆమెకు బదులిచ్చారు. రూ. 900 రీఫండ్ చేస్తామని తెలిపారు. కానీ అవి ఆమె ఖాతాలోకి వేయలేదు. ‘ఉబర్ క్యాష్’ కింద జమ చేశారు. అంటే ఆమె ఉబర్ రైడ్స్ సమయంలో మాత్రమే ఆ మొత్తాన్ని వాడుకునే వీలుంటుంది.

ఇంకో విషయం ఏంటంటే... బిల్లులో ఉత్తరప్రదేశ్ ఇంటర్ స్టేట్ చార్జ్ వేశారట. ఢిల్లీ సిటీ పరిధిలోనే తిరిగినా, యూపీలోకి ఎంటర్ కాకున్నా చార్జ్ చేయడం గమనార్హం. మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ కూడా రెండుసార్లు వేశారు. ఈ ట్యాక్స్ ను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై మాత్రమే వేస్తారు. ఇవన్నీ ఆమె బిల్లుతో కలిపి వేయడం గమనార్హం.


More Telugu News