రైస్ వాటర్ పట్టిస్తే.. శిరోజాలకు కొత్త అందం!

  • జుట్టుకు పోషణ, మంచి రూపాన్నిచ్చే గుణాలు
  • చుండ్రు కూడా తగ్గించుకోవచ్చు
  • తయారీ సులభం
  • అందరికీ సరిపడాలని ఏమీ లేదు
అందమైన శిరోజాలు కోరుకోని వారు ఉండరు. కానీ, నేడు అందమైన శిరోజాలన్నవి ఓ అదృష్టంగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. పెరిగిపోయిన కాలుష్యం, పోషకాల లేమి, పెరిగిపోయిన ఒత్తిళ్లు, హాన్మోన్లు, జీవక్రియల సమస్యలు ఇవన్నీ కలసి శిరోజాలను పలుచన చేయడమే కాకుండా, కళావిహీనంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో శిరోజాల ఆరోగ్యానికి, అందానికి రైస్ వాటర్ ప్రయత్నించి చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వందల ఏళ్లుగా జుట్టు ఆరోగ్యానికి బియ్యం నీరు వాడకం ప్రాచుర్యంలో ఉన్నదే. ఆరోగ్యంతోపాటు, జుట్టు రూపాన్ని కూడా ఇది మారుస్తుంది. జుట్టుకు బలాన్నిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందు బియ్యాన్ని నీటితో ఒక్కసారి కడగాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీటిలో ఒక కప్పు బియ్యాన్ని పోసి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత నీటిని వడగట్టుకుని ఒక స్ప్రేయర్ డబ్బాలో పోసుకోవాలి.

శిరోజాలకు ఈ రైస్ వాటర్ ను పట్టించే ముందు, జుట్టు శుభ్రంగా ఉంచుకోవాలి. బియ్యం నీరు కూడా తలవెంట్రుకలను శుభ్రం చేస్తుంది. రైస్ వాటర్ ను తలపై పోసుకుని లేదా స్ప్రే చేసుకుని తేలిగ్గా మర్థన చేసుకోవాలి. 5-10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత జుట్టుని సాధారణ ఉష్ణోగ్రతలోని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత జుట్టుపై తడిని ఆరనిచ్చి, దువ్వుకోవాలి.

జుట్టు కుదళ్లను ఈ రైస్ వాటర్ బలపడేలా చేస్తుంది. మంచి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ దెబ్బతిన్న కురులను మరమ్మతు చేస్తుంది. జుట్టు అందంగా కనిపించేలా చేస్తుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ ప్రాపర్టీలను తగ్గిస్తుంది. 

జాగ్రత్తలు
రైస్ వాటర్ అందరికీ పడాలని లేదు. కొందరిలో అలెర్జిక్ సమస్యలు కనిపించొచ్చు. అందుకని తల అంతటికీ రైస్ వాటర్ పట్టించొద్దు. మొదటి సారి ప్రయత్నించే వారు తలలో ఏదో ఒక చిన్న భాగానికి అప్లయ్ చేసుకుని పరీక్షించుకోవాలి. 24-48 గంటల వరకు ఎలాంటి అలెర్జీలు, దురదలు లేకపోతే రైస్ వాటర్ పడినట్టుగా భావించొచ్చు. వారానికి ఒకసారి మించి దీన్ని పెట్టుకోకూడదు. రెండు వారాలకోసారి కూడా పెట్టుకోవచ్చు.


More Telugu News