ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయ్: సీఎం జగన్

  • తిరువూరు సభలో ప్రతిపక్ష నేతలపై మండిపడ్డ జగన్
  • విలువలు లేని దుష్టచతుష్టయంతో పోరాడుతున్నామని వెల్లడి
  • ఎన్ని కుట్రలు చేసినా చివరకు మంచి మాత్రమే గెలుస్తుందన్న ముఖ్యమంత్రి
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ మరోమారు వెల్లడించారు. ఆదివారం తిరువూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధులను జగన్ విడుదల చేశారు. పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే విద్యాదీవెన పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు.

మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోతే పొత్తుల కోసం ప్రతిపక్షాలన్నీ ఎందుకు వెంపర్లాడుతున్నాయని జగన్ ప్రశ్నించారు. ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయని నిలదీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా చివరకు మంచి చేసిన వాడు మాత్రమే గెలుస్తాడని అన్నారు. రామాయణం, భారతం, బైబిల్, ఖురాన్.. ఎందులో చూసినా మంచిని మాత్రమే విజయం వరిస్తుందని ఉంటుందన్నారు. ఏ సినిమా చూసినా అందులో హీరోలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతారని జగన్ చెప్పారు.

గ్రామగ్రామానికి, ఇంటింటికీ చేరిన అభివృద్ధి ఫలాలపై కానీ, రైతులకు, అక్కాచెల్లెళ్లకు, అవ్వాతాతలకు, బడిపిల్లలకు అందుతున్న సంక్షేమ ఫలాల విషయంలో కానీ.. ఇలా ఏ విషయంలోనూ తమ ప్రభుత్వంతో వారి పాలనను పోల్చుకోలేరని జగన్ విమర్శించారు. గతంలో దోచుకో, పంచుకో, తినుకో.. అనేలా డీపీటీ ప్రభుత్వం నడిచిందని జగన్ విమర్శించారు. తమది మాత్రం డీబీటీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. అలాంటి వారు ఇప్పుడు ఏకమవుతున్నారని, విలువలు లేని దుష్టచతుష్టయంతో తాము పోరాడుతున్నామని జగన్ తెలిపారు.


More Telugu News