సరైన వేతనం అడగండి: ఆరోగ్యం కోసం డాక్టర్ సలహా

  • చేస్తున్న పనికి తగిన వేతనం లేకపోతే ఒత్తిడి పెరుగుతుందన్న డాక్టర్
  • ఆర్థిక ఒత్తిళ్లతోపాటు, పని ఒత్తిళ్లు సాధారణమైపోయాయని వెల్లడి
  • తోటి ఉద్యోగుల సాయం తీసుకోవాలని, అవసరమైతే సెలవు పెట్టాలని సూచన
పనిలో ఒత్తిడి నేడు సర్వ సాధారణమైపోయింది. కొన్ని పని ప్రదేశాల్లో అయితే ఈ ఒత్తిడి మరీ ఎక్కువ. దీన్ని అందరూ అధిగమించలేరు. కొందరు ఎంతో సతమతమై పోతుంటారు. దీని కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొనే వారు చాలా మందే మన సమాజంలో ఉన్నారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్, అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని చర్చకు తీసుకొస్తూ, కొన్ని సూచనలు చేశారు.

ఆర్థిక అనిశ్చితులు పెరిగిపోతున్న తరుణంలో, అంతర్జాతీయంగా ఎన్నో కంపెనీలు ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్యూచర్ ఫోరమ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో.. 40 శాతానికి పైగా ఉద్యోగులు (డెస్కుల్లో పనిచేసే వారు) మానసికంగా కుదేలవుతున్నారని, ఒత్తిడికి లోనవుతున్నారని తెలిసింది. ఇలాంటి పరిస్థితి నుంచి కోలుకునేందుకు ఆరు నెలలకు పైగా పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 

తన సహోద్యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురైనట్టు డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పని ప్రదేశంలో అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. ‘‘పని గంటలను పరిమితం చేసుకోండి. అవసరమైనప్పుడు, ముఖ్యంగా సమస్యల్లో ఉన్నప్పుడు తోటి ఉద్యోగుల సాయం తీసుకోండి. అనారోగ్యానికి గురైనప్పుడు సెలవు తీసుకోండి. బ్రేక్ తీసుకుని వెకేషన్ కు వెళ్లండి. కుటుంబం, స్నేహితులతో మంచి సమయాన్ని గడపండి. నిద్ర విషయంలో రాజీపడొద్దు. వేళకు ఆహారాన్ని తీసుకోండి. రోజువారీ వ్యాయామాలు చేయండి. మీరు పనిచేసే చోట, మీ పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరండి’’అన్న సూచనలు చేశారు.

ఉద్యోగంలో ఒత్తిళ్లతోపాటు, ఆర్థిక ఒత్తిళ్లు కూడా సాధారణంగా మారిపోయాయని డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. పని భారానికి తగ్గట్టు వేతనం లేనప్పుడు ఒత్తిడి పెరిగిపోతుందని ఆయన పేర్కొనడం గమనార్హం.


More Telugu News